ప్రజావాణిలో అరకొర అధికారులు..!

28-09-2026 | 12:20pm

11 గంటలు కావస్తున్నా పట్టుమని పది మంది హాజరు కాని వైనం 

కింది స్థాయి సిబ్బందిని పంపుతున్న మండల అధికారులు 

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నాగర్‌ కర్నూల్(Nagarkurnool) ఎంపీడీవో కార్యాలయం(MPDO Office)లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఉదయం 11 గంటలు కావస్తున్నా పట్టుమని పది మంది అధికారులు కూడా హాజరుకాలేదు. కొందరు మండల స్థాయి అధికారులు స్వయంగా హాజరు కాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలకు సరైన స్థాయిలో సమాధానాలు, పరిష్కారాలు లభించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రజావాణి లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు