కనీస అవసరాలకు నీళ్లు కరువు
- 3 రోజులకు ఒకసారి స్నానం
- ఉండాల్సింది 360, ఉంటున్నది 520 మంది బాలికలు
- కొమురవెల్లి కేజీబీవీలో తప్పని నీళ్ల తిప్పలు
- అధికారులు అటువైపు చూడండి..!
కొమురవెల్లి, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : కొమురవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో తాగునీరు, వినియోగ నీటి కొరత విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. బాలికల ప్రాథమిక అవసరాలకే నీళ్లు అందని పరిస్థితి నెలకొనడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 3 రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేయాల్సి వస్తోందని, కాలకృత్యాలు తీర్చుకోవడానికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
4 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అన్ని వసతులతో ఈ భవనాన్ని నిర్మించింది. అనంతరం దుల్మిట్ట కేజీబీవీకి భవనం లేకపోవడంతో అక్కడి విద్యార్థినులను కూడా ఇదే వసతిగృహానికి తరలించారు. ప్రస్తుతం కొమురవెల్లికి చెందిన 360 మంది, దుల్మిట్టకు చెందిన 160 మంది కలిపి మొత్తం 520 మంది విద్యార్థినులు ఒకే ప్రాంగణంలో ఉంటున్నారు. అయితే ఈ భవనం వాస్తవానికి 360 మంది అవసరాలకు అనుగుణంగా నిర్మించబడిందని స్థానికులు చెబుతున్నారు.
విద్యార్థినుల సంఖ్య పెరగడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీటి కొరత మరింత తీవ్రమైంది. పాఠశాల ప్రారంభమైన కొద్ది రోజులకే సమస్య మొదలైనా నెల రోజులుగా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ సమావేశం రోజునే ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్న దృశ్యాలు వారిని కలవరపరిచాయి. వర్షాకాలంలో పరిశుభ్రత లోపిస్తే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి శాశ్వత నీటి వసతి కల్పించాలని కోరుతున్నారు.
బోర్ మోటార్ ఏర్పాటుకు...
ఎంఈఓ రవి మాట్లాడుతూ మిషన్ భగీరథ పైపులు దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని, ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నామని చెప్పారు. రెండో బోరుబావికి పంపుసెట్ ఏర్పాటు కోసం చర్యలు చేపట్టామని, త్వరలో శాశ్వత పరిష్కారం అందిస్తామని వివరించారు.
నీటి సమస్య వాస్తవమే...
ఈ విషయంపై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పాక నీరజ స్పందిస్తూ, గతంలో నీటి సమస్య ఉన్న మాట వాస్తవమేనని, ప్రస్తుతం తాత్కాలికంగా పరిష్కరించామని తెలిపారు.
- కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పాక నీరజ






