8 March, 2026 | 3:24 AM

సూర్యకుమార్ రిటైర్మెంట్ ?

08-03-2026 01:27 AM

వరల్డ్ కప్ ఫైనల్‌తో వీడ్కోలు

అహ్మదాబాద్, మార్చి 7 : ఒకవైపు న్యూజిలాండ్‌తో భారత జట్టు ఫైనల్ కు సిద్ధమవుతుంటే మరోవైపు ఒక సంచలన వార్త వైరల్‌గా మారింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఆదివారం జరగబోయే టీ20 ప్రపంచకప్ ఫైనల్ తర్వాత సూర్యకుమార్ వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరుగుతోంది. కెప్టెన్సీ పరంగా ఆకట్టుకుంటున్నా వ్యక్తిగత ఫామ్ అనుకున్న స్థాయిలో లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి దీనిపై సూర్య నుంచి ఎలాంటి స్పందనా లేదు. అయితే భారత క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయంగా అతను భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉండడం కూడా మరొక కారణంగా చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సూర్యకుమార్ కేవలం టీ20 ఫార్మాట్  మాత్రమే ఆడుతున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరమైన స్కై తన కెరీర్‌లో కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే రోహిత్ , కోహ్లీ, జడేజా పొట్టి క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. రోహిత్ స్థానంలో టీ20 జట్టు పగ్గాలు అందుకున్న సూర్యకుమార్ టీమిండియాను అద్భుతంగా నడిపించాడు. సూర్య సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. ఇప్పుడు ఆదివారం జరిగే  ఫైనల్లో జట్టును గెలిపిస్తే టీమిండియాకు ప్రపంచకప్ అందించిన సారథుల జాబితాలో సూర్య కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇదిలా ఉంటే భారత జట్టు ఫైనల్లో ఓడినా కూడా సూర్యకుమార్ కెరీర్ ముగిసినట్టే.