7 July, 2026 | 10:13 AM

ఒడిదుడుకుల్లో మార్కెట్

16-05-2024 12:15 AM

మూడు రోజుల ర్యాలీకి బ్రేక్

117 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్

ముంబై, మే 15: వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన మార్కెట్ తిరిగి ఒడిదుడుకుల బాట పట్టింది. బుధవారం లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే  117పాయింట్లు తగ్గి 72,987 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 280 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయింట్లు క్షీణించి 22,200 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచి ఇంట్రాడేలో 22,297 పాయింట్ల మధ్య తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. హెవీవెయిట్ షేర్లు టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మార్కెట్‌ను ఆటు పోట్లకు గురిచేశాయి.

ఎన్నికల టెన్షన్

ఎన్నికల టెన్షన్‌తో ఇన్వెస్టర్లు కొంతమేర లాభాల స్వీకరణ జరపడంతో రోజంతా మార్కెట్ పరిమితశ్రేణిలో కదిలిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.  విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించగా, దేశీయ సంస్థలు ఎంపికచేసిన షేర్లలో కొనుగోళ్లు జరిపాయని నాయర్ తెలిపారు. మూడు రోజులు రికవరీ తర్వాత మార్కెట్ స్వల్ప విరామం తీసుకున్నదని, పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ కొన్ని హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ నష్టాలతో ముగిసిందని రెలిగేర్ స్టాక్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

వెలుగులో పవర్ షేర్లు

తాజా మార్కెట్లో పవర్ షేర్లు వెలుగును ప్రసరించాయి. పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీలు 3 శాతం వరకూ పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 1 శాతం వరకూ పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి రూ.2,301వద్ద ముగిసింది. లార్సన్ అండ్ టుబ్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్‌టెల్‌లు సైతం లాభ పడ్డాయి. మరోవైపు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనీలీవర్, నెస్లే, టైటాన్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 2.13 శాతం పెరిగింది. యుటిలిటీస్ ఇండెక్స్ 1.27 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.1 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 1.08 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.95 శాతం చొప్పున పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.75 శాతం నష్టపోగా, ఆటోమొబైల్ సూచి 0.31 శాతం, బ్యాంకెక్స్ 0.17 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.07 శాతం చొప్పున తగ్గాయి. స్మాల్ క్యాప్ సూచి 0.96 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.60 శాతం చొప్పున పెరిగాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాల జోరు

స్టాక్ సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. బుధవారం సైతం విక్రయాలు జరిపారు. తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 2,832 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు  స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 8 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 31,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.