తిరిగి రూ.73 వేలపైకి బంగారం
రూ.430 పెరిగిన ధర
హైదరాబాద్, మే 15: కొద్ది రోజులుగా స్తబ్దుగా ట్రేడవుతున్న బంగారం ధర తిరిగి రూ.73 వేలపైకి చేరింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ఈ ఏడాది వడ్డీ రేట్లు పెరిగే అవకాశం లేదని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పుత్తడి ఫ్యూచర్ ధర 15 డాలర్లకుపైగా పెరిగి 2,375 డాలర్ల వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.430 మేర పెరిగి రూ.73,250 వద్దకు చేరింది. బంగారం మూడు వారాల క్రితం రూ.74,340 వద్దకు చేరి కొత్త రికార్డును సృష్టించిన తర్వాత క్రమేపీ రూ.71,000 స్థాయికి తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్ద నిలిచింది. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో సైతం పూర్తి స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ.72,600 స్థాయికి చేరింది.
ఈ సంవత్సరాంతానికి రూ.83,000 గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా
బంగారం పరుగు ఇప్పట్లో ఆగబోదని, ప్రస్తుత సంవత్సరాంతానికి ఔన్సు బంగారం ధర 2,700 డాలర్లను చేరుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా వేసింది. అంటే ప్రస్తుత 2,375 డాలర్ల నుంచి మరో 325 డాలర్లు పెరుగుతుందని (13.7 శాతం) అంచనా. గోల్డ్‌మాన్ శాక్స్ అంచనాలు వాస్తవరూపం దాలిస్తే 2024 చివరినాటికి రూపాయిల్లో ఇక్కడ 10 గ్రాముల ధర మరో రూ.9,000 పెరిగి రూ.83,000కు చేరే అవకాశం ఉంటు ంది. గతవారం అంతర్జాతీయ మార్కెట్లో ఈ ధర 2,448 డాలర్ల రికార్డుస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. గత రెండు నెలలుగా బంగారం ధర 20 శాతం మేర ఎగిసింది. సాధారణంగా బంగారం ధరను వాస్తవ వడ్డీ రేట్లు, ఆర్థికాభివృద్ధి అంచనాలు, డాలరు విలువ ప్రభావితం చేస్తుంటాయని, ఈ ఏడా ది ఇప్పటివరకూ బంగారం పెరగడానికి ఈ సాంప్రదాయ అంశాలు కారణమని చెప్పలేమని గోల్డ్‌మాన్ శాక్స్ వివరించింది. వర్థ మాన దేశాల కేంద్ర బ్యాంక్‌ల భారీ కొనుగోళ్లు, ఆసియాలో రిటైలర్ల ఆసక్తితో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరను ప్రభావితం చేస్తున్నాయన్నది.






