ఎల్‌ఐసీకి మరో మూడేండ్ల గడువు
10 శాతం వాటా పబ్లిక్ లిస్టింగ్‌కు సెబీ అనుమతి
న్యూఢిల్లీ, మే 15: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు (ఎల్‌ఐసీ) మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఊరట నిచ్చింది. కనీస పబ్లిక్ వాటా నిబంధనల్ని పాటించడానికి సెబీ మరో మూడేండ్ల గడువు పొడిగించిందని ఎల్‌ఐసీ బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఎల్‌ఐసీలో పబ్లిక్ వాటాను కనీసం 10 శాతానికి చేర్చడానికి గడువు పెంచుతున్నట్టు సెబీ లేఖ ద్వారా మే 14న తెలియపర్చినట్టు పేర్కొంది. 2022 మే నెలలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఆఫర్ ద్వారా 3.5 శాతం వాటాను విక్రయించింది. ఇప్పుడు ఆ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉన్నది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం లిస్డెడ్ కంపెనీల్లో పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటాను ఇవ్వాలి. ఈ పరిమితిని సాధించేందుకు కొత్తగా లిస్టయిన కంపెనీలకు మూడేండ్ల గడువు ఉంటుంది. అయితే రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువ దాటిన కంపెనీలకు 25 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను పూర్తి చేయడానికి ఐదేండ్ల గడువు ఉన్నది. ఈ పెద్ద కంపెనీలు సెబీ నిబంధనల ప్రకారం లిస్టయిన రెండేండ్లకు 10 శాతం, ఐదేండ్లకు 25 శాతం వాటాను పబ్లిక్‌కు విక్రయించాలి. గత ఏడాది డిసెంబర్‌లో ఈ 25 శాతం నిబంధనను ఎల్‌ఐసీ పాటించడానికి 2032 వరకూ కేంద్ర ఆర్థిక శాఖ వెసులుబాటు ఇచ్చింది. ఎల్‌ఐసీ లిస్టయ్యి ఇప్పటికే రెండేండ్లు పూర్తయినందున కనీసం 10 శాతం పబ్లిక్ వాటా నిబంధనకు అనుగుణం గా వాటాను విక్రయించాల్సి ఉన్నది. అయితే ఈ పరిమితిని లిస్టింగ్ తేదీ నుంచి ఐదేండ్లలోపు పూర్తిచేయాలని సెబీ లేఖ రాసిందని ఎల్‌ఐసీ ఎక్సేంజీలకు తెలిపింది. దీని ప్రకారం 2027 మే 16లోపు ఎల్‌ఐసీ 10 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను సాధించాలి. తాజా వార్తతో ఎల్‌ఐసీ షేరు బుధవారం 3 శాతం పెరిగి రూ.962కు చేరింది.






