బ్లూచిప్‌ల్లో కొనుగోళ్లు
రెండో రోజూ మార్కెట్ జోరు.. మరో 253 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై, మే 17: రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ తదితర బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా రెండో రోజూ మార్కెట్ కనిష్ఠస్థాయి నుంచి కోలుకుని లాభాలతో ముగిసింది. ఎన్నికల ఫలితాల పట్ల ఆందోళనతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న స్టాక్ మార్కెట్ గురువారం నాటకీయంగా రికవరైన సంగతి తెలిసిందే. ఇదేరీతిలో శుక్రవారం సైతం ట్రేడింగ్ తొలిదశలో 200 పాయింట్లు పడిపోయి 73,460 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ తదుపరి ఆ స్థాయి నుంచి వేగంగా 600 పాయింట్లు రికవరీ అయ్యి 74,070 పాయింట్ల గరిష్ఠస్థా యిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 253 పాయింట్ల లాభంతో 73,917 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం తొలుత 60 పాయింట్లు క్షీణించి 22,345 పాయింట్ల వద్ద కనిష్ఠానికి తగ్గింది. ఆపై 22,502 పాయింట్ల గరిష్ఠాన్ని చేరింది. చివరకు ఈ సూచి 62 పాయింట్ల లాభంతో 22,466 పాయింట్ల వద్ద నిలిచింది.
మహీంద్రారయ్
ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన మహీంద్రా అండ్ మహీంద్రా రన్ శుక్రవారమూ కొనసాగింది. క్రితం రోజున 3 శాతం పెరిగిన ఈ షేరు తాజాగా సెన్సెక్స్ మరో 6 శాతంపైగా పెరిగి ఆల్‌టైమ్ రికార్డుస్థాయి 2,514 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.73 శాతం పెరిగి 2,870 వద్ద నిలిచింది. ఐటీసీ, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, ఇన్ఫోసిస్‌లు 2 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2.41 శాతం పెరిగింది. ఆటోమొబైల్ ఇండెక్స్ 1.80 శాతం, మెటల్ ఇండెక్స్ 1.50 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.55 శాతం, రియల్టీ ఇండెక్స్ 1.68 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.80 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.26 శాతం, మెటల్ ఇండెక్స్ 1.50 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.19 శాతం చొప్పున పెరిగాయి. ఐటీ, టెక్నాలజీ ఇండెక్స్‌లు తగ్గాయి. స్మాల్ క్యాప్ సూచి 1.39 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.18 శాతం చొప్పున పెరిగాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలకు బ్రేక్
స్టాక్ సూచీల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొద్ది రోజులుగా వేల కోట్లలో అమ్మకాలు జరుపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) శుక్రవారం మాత్రం నికర కొనుగోళ్లు జరిపారు. తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 1,667 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత 10ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ. 34,000 కోట్లకుపైగా మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.
నేడు ప్రత్యేక ట్రేడింగ్
బొంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లు రెండూ శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తాయి. విపత్కర పరిస్థితుల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎక్సేంజ్‌లు ఏర్పాటుచేసిన డిజాస్టర్ సైట్లను పరీక్షించేందుకు ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ఈ సెషన్ నడుపుతున్నారు. సెషన్ సమయంలో రెండు ఎక్సేంజీలు వాటి ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ (డీఆర్) సైట్‌కు మారుస్తారు. ఉదయం 9.15 నుంచి 10 గంటలవరకూ ప్రైమరీ సైట్‌లో ట్రేడింగ్ నిర్వహించి బ్రేక్ ఇస్తారు. తరువాత డీఆర్ సైట్ ద్వారా 11.15కు ట్రేడింగ్ మొదలై 12.30 గంటలకు ముగుస్తుంది.






