5 July, 2026 | 12:47 PM

పెరిగిన ఫారెక్స్

18-05-2024 12:18 AM

644.15 బిలియన్ డాలర్లకు విదేశీ మారక నిల్వలు

ముంబై, ఏప్రిల్ మే 17: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరుసగా రెండో వారమూ పెరిగాయి. మే 10తో ముగిసిన వారంలో మరో 2.56 బిలియన్ డాలర్ల మేర పెరిగి 644.15 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం మే 3 తో ముగిసిన వారంలో ఇవి 3.67 బిలియన్ డాలర్లు ఎగిసి 641.59 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఇవి 648.56 డాలర్ల రికార్డుస్థాయికి చేరిన తర్వాత అదే నెల చివరి మూడు వారాల్లో భారీగా తగ్గాయి. అటుతర్వాత ఈ నిల్వలు క్రమేపీ పుంజుకున్నాయి.  రిజర్వ్‌బ్యాంక్ శుక్రవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం మే 10తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.488 బిలియన్ డాలర్ల వరకూ తగ్గి 565.648 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలు పెరిగాయ్

దేశం వద్దనున్న బంగారం నిల్వలు సైతం సమీక్షావారంలో 1.072 బిలియన్ డాలర్ల మేర పెరిగి 55.952 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 5 మిలియన్ డాలర్లు పెరిగి 18.056 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు మాత్రం 4 మిలియన్ డాలర్లు  తగ్గి 4.495 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.