calender_icon.png 12 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెట్ బ్యాక్ లేదా..‘సెట్’ చేయ్!

12-11-2025 01:04:48 AM

-వార్డుల్లో ప్రజాప్రతినిధుల అనుచరుల దందా

-ఉదయం, సాయంత్రం వేళల్లో క్షేత్రస్థాయి పర్యటనలు 

-పునాది పడితే చాలు.. పైసలు ఇవ్వాల్సిందే!

-అనుమతులు లేని నిర్మాణాలే లక్ష్యంగా వసూళ్లు

-నిస్సహాయ స్థితిలో జీహెచ్‌ఎంసీ అధికారులు 

-ఎల్బీనగర్ నియోజకవర్గంలో జలగలు 

ఎక్కడా పునాది తీసినా.. రాయి కట్టినా.. రేకులు వేసినా.. షటర్లు, షెడ్లు కట్టినా.. సెట్ బ్యాక్ లేకపోయినా.. బహుళ అంతస్తులు కనిపించినా వెంటనే కార్పొరేటర్ల అనుచరులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వాలిపోతున్నారు. నోటీసులిచ్చి కూల్చివేతలు చేపట్టాల్సిన అధికారులు.. అదే నోటీసులను అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు తెర తీస్తున్నారు. అక్రమార్కులకు స్థానిక కార్పొరేటర్లు అండగా ఉండడంతో అధికారులు సైతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇలా ఎల్బీనగర్ నియోజకవర్గంలో వసూళ్ల దందా జోరుగా కొనసాగుతోంది. వారి ఆగడాలను అడ్డుకునేవారు లేరా? అని నిర్మాణదారులు ప్రశ్నిస్తున్నారు.

రంగారెడ్డి,/ఎల్బీనగర్, నవంబర్ 11 (విజయక్రాంతి): అక్రమాలను అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు సైతం నిస్సహాయంగా అక్రమార్కులకు జై కొడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టేవారికి కార్పొరేటర్లు అండగా ఉంటూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలు అధికారులకు అదనపు ఆదాయ మార్గంగా మారింది. ఆయా డివిజన్లలో రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు జీ ప్లస్ 2, 3 తీసుకుని అదనపు అంతస్తులు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు, చైన్ మన్లు, ఇతర సిబ్బంది అక్రమ నిర్మాణాలపై సమాచారం లేదా ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా నోటీసులు ఇస్తున్నారు. నిర్మాణాలను కూల్చి వేస్తామని, నోటీసుల పేరుతో అక్రమ నిర్మాణదారుల నుంచి అందిన కాడికి పైసలు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

కార్పొరేటర్ల దౌర్జన్యం

కొందరు కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. పదవీకాలం దగ్గర పడుతుండడంతో స్థానిక కార్పొరేటర్లు అందినకాడికి దండుకుంటున్నారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను గుర్తించి, మీ జోలికి ఎవరూ రాకుండా చూస్తామని హామీ ఇస్తూ బేరసారాలు ఆడుతున్నారు. ఇందుకు కార్పొరేటర్ల అనుచరులను నిర్మాణాల వద్ద రక్షణగా ఉంచుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక కార్పొరేటర్ల అనుచరులు ఆయా డివిజన్ల పరిధిలో నూతన నిర్మాణాలపై నిరంతరం నిఘా పెడుతూ నిర్మాణదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, మన్సూరాబాద్, హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, చంపాపేట, లింగోజిగూడ, హస్తినాపురం డివిజన్లలో వసూళ్ల పర్వం కొనసాగుతున్నది. 

రెచ్చిపోతున్నారు..

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో అనేక నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి. కొందరు అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేస్తుండగా... మరికొందరు ఆర్థిక, రాజకీయ అండతో అనుమతులు తీసుకోకుండా చేపడుతున్నారు. ఫిర్యాదుల అధారంగా జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే, మాకు అందరూ తెలుసు అని, మాకు కార్పొరేటర్ బంధువు అని, ఫలానా పార్టీ నాయకుడి స్థలం అని, జీహెచ్‌ఎంసీ అధికారులు మా స్నేహితులు అంటూ అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతున్నారు. సక్రమంగా అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, రాజకీయ నాయకులు, అధికారుల అండ ఉందని ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం లేదు. ఆయా నిర్మాణాలతో పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని మధ్య దళారులు దోచుకుంటున్నారు.

అక్రమాలు ఎక్కడెక్కడ?

 ఆయా డివిజన్లలో వంద, రెండు వందల గజాల్లోపు ఖాళీ స్థలాల్లో ఏకంగా ఐదారు అంతస్తులు నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల అనుమతులకు భిన్నంగా సెట్ బ్యాక్ లేకుండా సెల్లార్లతో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. వీరందరూ తమకు రాజకీయ నాయకులు, అధికారులు తెలుసంటూ పనులు చేయిస్తున్నారు. హయత్ నగర్ డివిజన్ లో పాత రోడ్డు, డిఫెన్స్ కాలనీ రోడ్డులో అక్రమ నిర్మాణదారులు ఎవరినీ లెక్క చేయకుండా పనులు చేపడుతున్నారు. ఒకరు అయితే, సీఎంవో అధికారులు తెలుసు అంటూ నిరంతరాయంగా పనులు చేస్తున్నారు.

మరొకరు మా వెనక అధికార పార్టీ నాయకులు ఉన్నారని, జీహెచ్‌ఎంసీ అధికారులు తెలుసంటూ పనులు పూర్తి చేశారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులో, హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్డులో, బీఎన్ రెడ్డి నగర్ ఎన్జీవో కాలనీ, ఎస్‌ఆర్ కేడీ నగర్, వైదేహి నగర్, లింగోజిగూడ డివిజన్లలో కార్పొరేటర్ అనుచరులు దగ్గర ఉంటూ నిర్మాణాలు చేయిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వెళ్లి కార్పొరేటర్లు, అధికారులకు చెప్పుకో అంటూ నిర్మాణదారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.