12-11-2025 01:15:30 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): రోజంతా ప్రశాంతంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ చివరి గంటలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
తమ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయడమేంటని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఇరు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి చేజారుతుండటంతో పోలీసులు భారీగా మోహరించి, ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో పోలీసులు మాగంటి సునీత, పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
అపెక్స్ స్కూల్ వద్ద ఉద్రిక్తత
అంతకుముందు, అపెక్స్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ల (4, 5, 6, 7) వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. గుంపుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించినా వారు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఈ రెండు ఘటనలతో పోలింగ్ చివరి గంట నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం అధికారులు నివేదిక కోరినట్లు సమాచారం.