calender_icon.png 12 November, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ బియ్యం మాయం?

12-11-2025 01:00:47 AM

- పక్కదారి పట్టించిన మిల్లర్లు

- కన్నెత్తి చూడని సివిల్ సప్లు అధికారులు

కరీంనగర్, నవంబర్11(విజయక్రాంతి): జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం పెద్ద మొత్తంలో మాయమైంది. రాష్ర్ట ప్రభుత్వానికి బియ్యం పట్టించి ఇవ్వాల్సిన మిల్లర్లు ఆ ధాన్యాన్నే పక్కదారి పట్టించారు. ఎప్పటికప్పుడు మిల్లులను తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయిస్ అధికారు లు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించారు.  విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారు లు  తనిఖీల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు వెల్లడైంది. ఇరవై రోజుల క్రితం  జరిగిన తనిఖీలను కూడా గోప్యంగా ఉంచారు.  రాష్ర్ట ప్రభుత్వానికి కోట్లలో మిల్లర్లు బాకీ ఉన్న నిమ్మకు నిరేత్తనట్లుగా వ్యవహరిస్తున్నారు.

సివిల్ సప్లు డిపార్ట్మెంట్లో 52 కోట్ల రూపాయలు విలువ చేసే వరి ధాన్యం మాయమైనట్లు తెలుస్తోంది. 15 రైస్ మిల్లులకు 34,301 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించగా సిఎంఆర్ చేసి తిరిగి ప్రభుత్వానికి అందించకుండా రైస్ మిల్లర్లు దోపిడి చేసినట్లు సమాచారం. వీరిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టకపోవడం పట్ల సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసేంతవరకు స్థానిక అధికారులకు విషయం తెలియకపోవడం మిల్లర్లకు అధికారులకు మధ్య ఉన్న అవగాహనకు అద్దం పడుతుంది.    ఈ కుంభకోణం 2021 నుండి 2025 వరకు కొనసాగినట్లు స్పష్టమవుతుంది. మిల్లు కెపాసిటీని బట్టి ధాన్యాన్ని కేటాయిస్తారు.

కొంత మంది మిల్లర్లు ఐదు టన్నుల కెపాసిటీ ఉన్నా దాన్ని ఫోర్జరీ చేసి 10 నుంచి 15 టన్నులు ఉన్నట్లు సివిల్ సప్లయీ అధికారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దీనికి తగ్గట్టుగా ఒకొక్క రారైస్ మిల్లుకు సుమారు 200 నుంచి 300 లారీల వరకు, పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు 500 నుంచి 600 లారీల వరకు ధాన్యాన్ని కేటాయించారు. క్వింటాల్ ధాన్యానికి 65 కిలోల బియ్యాన్ని రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి అందజేయాలి. కొంత మంది మిల్లర్లు ధాన్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ధాన్యం ఉందా లేదా అని ఎప్పటికప్పుడు సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. సివిల్ సప్లయిస్ అధికారులు మిల్లర్ల వద్ద వసూళ్లకు అలవాటు పడి అటు వైపు వెళ్లలేదు.

దీంతో మిల్లర్లు ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించే విషయంలో సివిల్ సప్లయిస్ అధికారులు మిలాఖత్ అయినట్లు తెలిసింది. వ్యాపారుల గత చరిత్ర చూడకుండానే పెద్దఎత్తున వారికి ధాన్యం కేటాయించారు. వ్యాపారులతో సివిల్ సప్లయిస్ అధికారులు కుమ్మక్కు కెపాసిటీ లేని మిల్లులకు ఎక్కువగా ధాన్యం కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నట్లు తెలిసింది.

సీఎంఆర్ పాలసీలో ఉన్న లోసుగులను ఆసరాగా చేసుకొని మిల్లర్లు రాజకీయ నాయకులతో సిఫారసులు పెద్దఎత్తున ధాన్యాన్ని కేటాయించుకున్నారు. ప్రభుత్వానికి నామమాత్రంగా మిల్లర్లు బియ్యం పెట్టి చేతులు దులుపుకుని ధాన్యాన్ని మాయం చేశారు. 2021 నుంచి 2024 వరకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని  దర్జాగా స్వాహా చేయడంతో అధికారులు కంగు తిన్నారు.