26 May, 2026 | 2:17 AM

వ్యర్థాలకు నిప్పు.. ప్రాణాలకు ముప్పు!

26-05-2026 01:20 AM
  1. రైతన్నా.. జర సోచో..
  2. పంట చేలలో మంట వద్దు
  3. పర్యావరణానికి చేటు చేయొద్దు

మహబూబాబాద్, మే 25 (విజయక్రాంతి): పంట చేలల్లో మిగిలిన పంట అవశేషాలను ఇటీవల దగ్ధం చేస్తున్న సంఘటనలు అధికమవుతున్నాయి. రేగళ్ల బారిన పడి ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామంలో సాగర్ల చంద్రమౌళి, భాగ్యమ్మ దంపతులు దుర్మరణం పాలు కాగా, హనుమకొండ జిల్లాలో దట్టమైన పొగ రోడ్డుపై కమ్ముకోవడంతో నడికూడ కు చెందిన క్రాంతి కుమార్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలాడు.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా  ప్రతిరోజు ఏదో ఒకచోట పంట పొలాల్లో వ్యర్థాలకు పెట్టే నిప్పు వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంటలు దావాగ్నిగా మారి పరిసరాల్లో ఉన్న వ్యవసాయ పనిముట్లు, ఇతర పండ్ల తోటలకు వ్యాప్తిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మంటల వల్ల ఇతర పంటలు కోల్పోవడంతో పాటు వ్యవసాయ పరికరాలు కాలి బూడిద కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. 

మంటల వల్ల భూమికి నష్టం..

పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోవడంతో పాటు సూక్ష్మ జీవులు నశిస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి సారవంతానికి దోహదపడే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల సారవంతం తగ్గుతుందని, నీల గట్టి పడి తేమ నిల్వ ఉండదని చెబుతున్నారు. ఫలితంగా మరుసటి సీజన్లో సాగు చేసే పంటల దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపుతోందని చెబుతున్నారు. పంటల అవశేషాలను కాల్చడం వల్ల పొగవ్యాప్తించి కాలుష్యం పెరుగుతుందని, వాయు కాలుష్యం ఏర్పడి ప్రజలకు శ్వాసపూస సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. కట్టమైనా పొగ కమ్ముకోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించడం, పశుపక్షాదులకు, జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. 

మంటలు వ్యాప్తించడానికి కారణం ఇదే..

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రేగళ్ల మంటల వ్యాప్తికి ప్రధాన కారణం యంత్రాల వినియోగమేనని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పంటలకు కూలీల చేత కోతలు పెట్టించేవారని, దీనితో పంట అవశేషాలు పెద్దగా పంట పొలాల్లో ఉండే పరిస్థితి లేకుండా పోయేదన్నారు. కేవలం కొయ్య కాళ్లు మాత్రమే ఉండేవని, వాటిని వర్షాకాలం ముందు నీటి తడులతో మురగబెట్టి కలియ దున్నేవారని, ఒకవేళ కొందరు మంట పెట్టినప్పటికీ ఎక్కడికక్కడే నేలలో కొయ్య కాళ్లు కాలి బూడిదగా మారేవని చెబుతున్నారు. యంత్రాల వినియోగం వల్ల ప్రస్తుతం పొల్లు అధికంగా భూమిలో ఉండడం వల్ల ఒకచోట మంట పెట్టగానే క్షణాల్లో విస్తరించి, చెట్లు, చేమలు దగ్ధమవుతున్నాయని చెబుతున్నారు. 

పంట అవశేషాలను కాల్చద్దు

పంట అవశేషాలను కాల్చకుండా, పొలంలోనే కలియదున్నే విధానాన్ని పాటించాలని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంట అవశేషాలను భూమిలో కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గుతుందని, పర్యావరణ కాలుష్యం తగ్గి ఆరోగ్యకరమైన వాతావరణం మరింత మెరుగవుతుందని సూచిస్తున్నారు. రోటవేటర్ ద్వారా పత్తి, మొక్కజొన్న, వరి మెదళ్లను భూమిలో కలియ దున్నవచ్చని చెబుతున్నారు. 

అవశేషాలను కాలిస్తే చట్టపరమైన చర్యలు

పంటల అవశేషాలను కాల్చడం వల్ల ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని మంటలు ఇతర చోటికి వ్యాప్తించడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని, పలు సంఘటనల్లో ప్రాణాలు కూడా కోల్పోతుండడంతో పంటల అవశేషాలను కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంటల అవశేషాలను కాల్చడం తగదని, ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించి అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు.

అన్నదాత లారా.. అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్న పంటల అవశేషాల దగ్ధం ఘటనలకు ఇకనైనా పుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలు వ్యాప్తించకుండా ముందుగా తమ పంట పొలాల నలువైపులా ముందస్తు నివారణ, రక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.