కట్టు కాల్వ కట్టకు మరమ్మతులు కరువు!
కట్టకు నాలుగు చోట్ల గండి
అధికారుల నిర్లక్ష్యం, రైతుల పాలిట శాపం
గంభీరావుపేట, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో పెద్ద చెరువుకు జీవనాధారమైన కట్టు కాలువ కట్ట గతేడాది భారీ వర్షాలకు గండి పడి తెగిపోయినప్పటికీ ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత వర్షాకాలంలో కట్టు కాలువ గట్టు నాలుగు చోట్ల దెబ్బతిని వందల ఎకరాలు నీటమునిగిపోయాయి . అయితే ఏడాది గడిచినా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కాలువ గట్టు నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో సాగు అనిశ్చితిలో పడింది.మానేరువాగు నుంచి పెనం మడుగు మీదుగా కట్టు కాలువ ద్వారా పెద్ద చెరువుకు నీరు చేరాల్సి ఉండగా, కట్ట దెబ్బతినడంతో చెరువు వెలవెలబోతోంది.
చెరువు నిండకపోతే సాగుతో పాటు త్రాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కట్టు కాలువకు శాశ్వత మరమ్మతులు చేపట్టి సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు. అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
నిధులు కేటాయించాలి
తెగిపోయిన కట్టకు శాశ్వత మరమ్మతులు చేస్తేనే పెద్ద చెరువు నీటితో కలకలలాడుతుంది. సాగుకు త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కట్టు కాలువ కట్టకు శాశ్వత మరమ్మతుల కోసం వెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలి.
చేకూటి మహేష్ యాదవ్, సర్పంచ్, మల్లారెడ్దిపేట






