హత్నూర గురుకులంలో తీవ్ర అవస్థలు
● ప్రిన్సిపాల్ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆగ్రహం
● చీకట్లోనే వాష్‌రూమ్‌లు.. టార్చ్ లైట్లే శరణ్యం
● జిల్లా కలెక్టరేట్ లో ‘ప్రజావాణి’కి చేరిన విద్యార్థుల గోడు
● తక్షణమే ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని డిమాండ్
హత్నూర సెప్టెంబర్ 16: ఒకవైపు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఉచిత విద్య, పౌష్టికాహార వసతులు కల్పిస్తుంటే.. క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల ఆ ఆశయాలు నీరుగారిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (ఎస్సీ హాస్టల్)లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. పర్యవేక్షణ లోపం, పరిశుభ్రత కరువై విద్యార్థులు తీవ్ర అల్లకల్లోలానికి గురవుతున్నారు. ఈ దారుణ పరిస్థితులకు ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరి, సిబ్బందితో సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని ఆగ్రహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు తిరుగుబాట పట్టారు.
•టార్చ్ లైట్ల వెలుగులోనే వాష్‌రూమ్‌లు!
హాస్టల్లో కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. వాష్‌రూమ్‌లు అత్యంత అపరిశుభ్రంగా మారి నాచుపట్టిపోతున్నాయి. కనీసం నీటి సరఫరా టాప్‌లు కూడా లేకపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. రాత్రి వేళల్లో టాయిలెట్‌కు వెళ్దామంటే విద్యుత్ దీపాలు (లైటింగ్) లేవు. దాంతో తల్లిదండ్రులే సొంత ఖర్చులతో పిల్లలకు టార్చ్ లైట్లు కొనివ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. చీకటిలో బయటకు వెళ్లే క్రమంలో దోమల బెడదతో పాటు పాములు, తేళ్లు, కోతుల భయంతో విద్యార్థులు నిత్యం ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని గడుపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న పండ్లు, ఫలాలు పిల్లలకు అందడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వంట గ్యాస్ అందుబాటులో ఉన్నప్పటికీ, పొగతో కూడిన కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తుండటంతో వాతావరణం మసిబారిపోయి విద్యార్థులు ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యల బారిన పడుతున్నారు.
•అనారోగ్యానికి గురైనా పట్టించుకోని వైనం
హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా, కాళ్లు చేతులకు పుండ్లు పడి అల్లాడుతున్నా సకాలంలో వైద్యులకు చూపించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కనీసం బ్రెడ్, పాలు వంటి పౌష్టికాహారం కూడా అందించడం లేదని, విషయం తెలిశాక తామే స్వయంగా వచ్చి పిల్లలను ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉదయం వేళల్లో పీటీ, పీడీలు ఆటలు ఆడించడమే తప్ప విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు.
•ప్రజావాణిలో జేసీకి వినతిపత్రం
ఇటీవల నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో ప్రిన్సిపాల్ తీరుపై తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రగతిశీల విద్యార్థుల పేరెంట్స్ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ప్రిన్సిపాల్‌కు, ఉపాధ్యాయులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పాఠశాల నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నదని, తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
•6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి: ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్
ఈ సమస్యలపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా.....పాఠశాలలో జెఎల్ (సివిక్స్, ఇంగ్లీష్), టిజిటి (తెలుగు, ఇంగ్లీష్, హిందీ), లైబ్రేరియన్, హెల్త్ సూపర్వైజర్ సహా 6 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గడిచిన ఏడాదిన్నరగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గానే పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, సిబ్బంది కొరత వల్ల పర్యవేక్షణ కష్టమవుతోందని చెప్పారు. నిధుల సమస్య, కాంట్రాక్టర్ల సమయానికి దొరుకుపోవడం వల్లే నిర్లక్ష్యం వల్లే భవనాల మరమ్మతులు, డైనింగ్ హాల్ నిర్మాణం ఆలస్యమవుతోందని వివరించారు.
•అధికారులు స్పందించాలి
గురుకులంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులకు మెరుగైన వసతులు, భద్రత కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.