1 September, 2026 | 9:42 PM

శిరీష హత్యాచార నిందితుడికి కఠిన శిక్ష

01-09-2026 | 08:34pm

ఇల్లెందు,(విజయక్రాంతి): ఆదివాసీ యువతి శిరీషపై(Adivasi young woman Sirisha) అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సనవుల్లా ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ జిల్లా నాయకుడు గంగాధర గణేష్‌(PDSU district leader Gangadhar Ganesh) డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ.. ఆదివాసీ కుటుంబం నుంచి ఉన్నత విద్యను అభ్యసించి నర్సుగా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్న శిరీష అత్యాచారానికి గురై హత్యకు గురికావడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు.

మహిళలపై అత్యాచారాలు పునరావృతమవుతున్నా నిర్భయ చట్టాలను సమర్థంగా అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. మహిళలకు పని ప్రదేశాల్లో, ప్రయాణాల్లో భద్రత కల్పించడంతో పాటు రక్షణ చర్యలు చేపట్టని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యాచారాలు, నేరాలకు కారణమవుతున్న గంజాయి, డ్రగ్స్‌, కొకైన్‌ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆయుష్‌, లక్ష్మీనరసింహ, వెన్సికా, లిఖిత, సికిందర్‌, అక్షయ, హేమచంద్ర, సాయి, చరణ్‌, సింధుజ, నందిని తదితరులు పాల్గొన్నారు.