బంగారంతో చిక్కిన శశిథరూర్ పీఏ
ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు
న్యూఢిల్లీ, మే 30: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పీఏ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేయగా, 500 గ్రాములకు పైగా బరువున్న బంగారం గొలుసు గుర్తించారు.
దాని విలువ దాదాపు రూ.35లక్షలు ఉం టుందని అధికారులు తెలిపారు. అయితే బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వారిని అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు శశిథరూర్ పీఏ అని అధికారులు చెబుతున్నారు. అతడి వద్ద ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ ఉందని, ఇది ఎంపీ ప్రోటోకాల్ బృందంలో భాగంగా తీసుకున్నాడా లేదా అనే కోణం లో పరిశీలన జరుపుతున్నామని వివరించారు.
కాగా, ఈ ఘటనపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ధర్మశాలలో ఉండగా ఈ విష యం తెలిసి షాక్‌కు గురయ్యానని, ఆ వ్యక్తి తన వద్ద గతంలో పీఏగా పనిచేసి రిటైర్ అయ్యాడని చెప్పారు. 72 ఏళ్ల వయసులో అనారోగ్యం సహకరించట్లేదని చెబితే మళ్లీ విధుల్లోకి తీసుకున్నామని, ఇలాంటి తప్పు లు చేసే వారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు.
మరోసారి స్మగ్లింగ్ కలకలం..
ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో దుమారం రేపింది. తాజా ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి శశిథరూర్‌కు వ్యతిరేకం గా పోటీ చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ దీనిపై స్పందించారు. ‘గతంలో సీఎం పినరయ్ విజయన్ సెక్రటరీ బంగారం స్మగ్లింగ్‌లో చిక్కారు. ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కాంగ్రెస్ ఎంపీ పీఏను అరెస్టు చేశారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలపైన సీపీఎం, కాంగ్రెస్.. బంగారం అక్రమ రవాణాలోనూ భాగస్వాములయ్యారు’ అని దుయ్యబట్టారు.






