26 July, 2026 | 4:11 PM

సరిహద్దుల్లో చైనా యుద్ద విమానాలు

31-05-2024 12:47 AM

సిక్కింకు 150 కిలోమీటర్ల దూరంలో మోహరింపు

న్యూఢిల్లీ, మే 30: సరిహద్దు దేశాలతో కయ్యానికి కాలుదువ్వే చైనా బుద్ధి ఏమాత్రం మారటం లేదు. ఇప్పటికే తైవాన్‌ను దిగ్బంధించి, దక్షిణ చైనా సముద్రమంతా తనదేనని చుట్టూ ఉన్న దేశాలను బెదిరిస్తున్న డ్రాగన్ దేశం.. భారత్‌తో కూడా మరోసారి కయ్యానికి కాలుదువ్వే పనులు చేస్తున్నది. భారత సరిహద్దుకు కేవలం 150 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక యుద్ధ విమనాలను మోహరిం చింది. చైనా ఆక్రమణలో ఉన్న టిబెట్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన షిగాట్సేలో చైనా పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే ఎయిర్‌పోర్టును నిర్మించింది.

ఇది సముద్ర మట్టానికి 12,408 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న ఎయిర్‌పోర్టు ఇదే. ఈ ఎయిర్‌పోర్టు శాటిలైట్ చిత్రానలు ఆల్ సోర్స్ అనాలిసిస్ అనే సంస్థ ఈ నెల 27న సేకరించింది. అందులో చైనాకు చెంది న అత్యాధునిక జే యుద్ధవిమానాలు ఆరు నిలిపి ఉంచినట్టు స్పష్టం గా కనిపించింది. అక్కడే కేజే ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్, కంట్రోల్ విమానం కూడా ఉన్నది. ఈ ప్రాంతం పశ్చిమబెంగాల్‌లోని హసిమరాకు 290 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. హసిమరాలో భారత ఎయిర్‌ఫోర్స్ బేస్ ఉన్నది. ఇక్కడ అత్యాధునిక 16 రాఫెల్ యుద్ధవిమానాలను భారత్ మోహరించింది. చైనా మోహరింపుపై భారత వాయుసేన ఎలాంటి ప్రకటనా చేయలేదు.