ఆరోగ్యంపై నన్నే అడుగొచ్చుగా?
ప్రధాని మోదీపై ఒడిశా సీఎం సెటైర్లు
వీకే పాండియన్ నా వారసుడు కాదు: పట్నాయక్
భువనేశ్వర్, మే 30: తన ఆరోగ్యంపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఖండించారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, నెల రోజులుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నానని 77 ఏండ్ల సీఎం వెల్లడించారు. ఏఎన్‌ఐకి గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గత పదేండ్లుగా తన ఆరోగ్యంపై ఇలాంటి వదంతులే వస్తున్నాయని చెప్పారు. ‘నేను తనకు మంచి మిత్రుడినని ఆయన (మోదీ) గతంలో బహిరంగంగానే ప్రకటించారు.
ఆయన నా ఆరోగ్యం గురించి అంత ఆందోళన చెందితే నేరుగా నాకే ఫోన్ చేసి వాకబు చేయవచ్చు కదా? నిన్న (బుధవారం) బహిరంగ సభల్లో ముడూసార్లు నా ఆరోగ్యం గురించి అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఇదంతా ఆయన (మోదీ) ఎందుకు చేస్తున్నారో తెలుసు. ఎన్నికల్లో ఓట్లు అడుక్కోవటానికి వేస్తున్న ఎత్తులు. నా ఆరోగ్యం గురించి ఢిల్లీవాళ్లు గత పదేండ్లుగా ఇవే వదంతులు ప్రచారం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
పాండియన్ నా రాజకీయ వారసుడు కాదు
అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ)లో మాజీ బ్యూరోక్రాట్ వీకే పాండియన్ పాత్రపై తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో నవీన్ పట్నాయక్ గురువారం స్పష్టతనిచ్చారు. వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ప్రకటించారు. ‘అతను నా వారసుడు కాదు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారమంతా అతిశయోక్తి, అబద్ధమే. నా వారసున్ని ఒడిశా ప్రజలే నిర్ణయిస్తారని నేను పదేపదే చెప్తూనే ఉన్నాను. ఈ అతిశయోక్తులు నాకు అర్థంకావటంలేదు. అతడు (వీకే పాండియన్) కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయటంలేదు. నా బదులు పాండియన్ నిర్ణయాలు తీసుకొంటున్నారటం పూర్తిగా అబద్ధం’ అని స్పష్టంచేశారు.






