షాక్ మార్కెట్
న్యూఢిల్లీ, జూన్ 4: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌కు భారీ షాక్ ఇచ్చాయి. బీజేపీ స్పష్ఠమైన మెజారిటీ సాధించి, తిరిగి ఎన్‌డీఏ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న మార్కెట్ విశ్లేషకుల అంచనాలు గురితప్పడంతో మంగళవారం స్టాక్ సూచీలు తీవ్ర పతనాన్ని చవిచూశాయి. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ ఎన్‌డీఏ 360 స్థానాలకుపైగా విజయం సాధిస్తుందని వెల్లడించ డంతో సోమవారం 3 శాతం పెరిగిన మార్కెట్ మంగళవారం అంతకు రెట్టింపు 6 శాతం క్షీణించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 4,390 పాయింట్లు క్షీణించి (5.74 శాతం) రెండు నెలల కనిష్ఠస్థాయి 72,079 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 6,234 పాయింట్లు (8.15 శాతం) పడిపోయి, దాదాపు ఐదు నెలల కనిష్ఠస్థాయి 70,234 పాయింట్లను సైతం తాకింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 1,982 పాయింట్లు (8.52 శాతం) పతనమై 21,281 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకగా, ముగింపులో షార్ట్ కవరింగ్ ప్రభావంతో నష్టాలను కొంతమేర పూడ్చుకుని 1,379 పాయింట్ల క్షీణతతో (5.93 శాతం) 21,884 పాయింట్ల వద్ద ముగిసింది. నాలుగేండ్ల తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఇంతగా పతనంకావడం ఇదే ప్రధమం. 2020 మార్చి 23 కొవిడ్ లాక్‌డౌన్ విధించిన సందర్భంలో సెన్సెక్స్, నిఫ్టీ లు 13 శాతం పడిపోయాయి. పీఎస్‌యూలు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, విద్యుత్, ఎనర్జీ, యుటిలిటీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లను ఇన్వెస్టర్లు భారీగా వదిలించుకున్నారు.
వీటికి తోడు హెవీవెయిట్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 7 శాతం క్షీణించి స్టాక్ సూచీలను బాగా దెబ్బతీసింది. బీజేపీ గెలుపును అంచనా వేస్తూ గత కొద్దినెలలుగా ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ షేర్లు తీవ్ర పతనాన్ని చవిచూశాయి. రీసెర్చ్ హెడ్, జియోజిత్ ఫైనాన్షియల్ 2019 మే 23న నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు సెన్సెక్స్ 299 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 81 పాయింట్లు క్షీణించింది. అయితే ఆ రోజున ఇంట్రాడేలో సెన్సెక్స్ తొలిసారిగా 40,000 పాయింట్లను, నిఫ్టీ 12,000 పాయింట్లను తాకాయి.
టాప్ లూజర్ ఎన్టీపీసీ
సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా ఎన్టీపీసీ 15 శాతంపైగా పడిపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 14 శాతం క్షీణించగా, లార్సన్ అండ్ టుబ్రో 12 శాతంపైగా పడిపోయింది. పవర్‌గ్రిడ్ 12 శాతం తగ్గింది. టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్టీస్ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు సైతం తీవ్ర నష్టాల్ని చవిచూశాయి. మరోవైపు హిందుస్థాన్ యూనీలీవర్ 6 శాతం ర్యాలీ జరపగా, నెస్లే 3 శాతం లాభపడింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్ స్వల్పంగా లాభపడ్డాయి.ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాలతోనే ముగిసాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 8.07 శాతం పడిపోగా, స్మాల్‌క్యాప్ సూచి 6.79 శాతం పతనమయ్యింది. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా యుటిలిటీస్ 14.40 శాతం, పవర్ ఇండెక్స్ 14.25 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 13.07 శాతం, సర్వీసుల సూచి 12.65 శాతం, క్యాపిటల్ గూడ్స్ 12.06 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 11.62 శాతం చొప్పున పడిపోయాయి. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం షేర్లలో 3,349 షేర్లు క్షీణించగా, 488 షేర్లు లాభపడ్డాయి.
ఆర్థిక సంస్కరణల అమలుపై భయాలు
‘ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్‌డీఏ 350 స్థానాల్ని చేజిక్కించుకుంటుందన్న అంచనాలు వెలువడగా, 290 స్థానాల్లోనే లీడ్‌లో ఉన్నదనే ట్రెండ్స్ చూసినంతనే మార్కెట్లు పతనబాట పట్టాయి. ప్రధాన భాగస్వామ్య పక్షాలతో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుచేసినా, తగిన విధాన నిర్ణయాలు తీసుకోలేదన్న భయాలు ఇన్వెస్టర్లలో వ్యాపించాయి. మోదీ నేతృత్వంలో గత రెండు టెర్మ్‌ల్లోనూ జరిగిన ఆర్థిక సంస్కరణలు మూడో టెర్మ్‌లో కుంటుపడతాయన్న సందేహాలతో మార్కెట్ పతనమయ్యింది.
స్పష్ఠత ఏర్పడేంతవరకూ ఇన్వెస్టర్లు వేచిఉండటం శ్రేయస్కరం’ చౌదరి రీసెర్చ్ హెడ్, స్టాక్‌బాక్స్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మార్కెట్‌కు స్థిరత్వం ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వెలువడటంతో దేశీయ స్టాక్ మార్కెట్ భయాలు వ్యాపించి అమ్మకాలు జరిగాయి. ఇటీవలి మార్కెట్ ర్యాలీ పూర్తిగా రివర్స్ అయ్యింది. అయితే అధిక స్థానాలను గెలుచుకున్న బీజేపీ నేతృత్వంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మార్కెట్ స్థిరపడుతుందని అంచనా వేస్తున్నాం. తాజా ఎన్నికల ఫలితాలతో రాజకీయ విధానంలో మార్పు వస్తుందని, సామాజిక ఆర్థికాంశాలపై దృష్టి మళ్లుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’
నాయర్ జియోజిత్ ఫైనాన్షియల్






