29 May, 2026 | 8:04 PM

Karnataka Politics: ఖర్గే, రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ

29-05-2026 12:14 PM

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం(Congress Party High Command) ఆదేశాల మేరకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను సమర్పించిన ఒక రోజు తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) శుక్రవారంనాడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో(Rahul Gandhi) భేటీ అయ్యారు. సిద్దరామయ్య, రణదీప్ సుర్జేవాలాతో కలిసి, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటకలోని పార్టీ వ్యవహారాలతో సహా కీలక రాజకీయ, సంస్థాగత అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. 

ఇంతలో, తదుపరి నాయకత్వంపై ఊహాగానాలు ముమ్మరమయ్యాయి. సీఎం పదవికి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) ప్రధాన పోటీదారుగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (Karnataka Pradesh Congress Committee) అధ్యక్షుడి వంటి కీలక పదవికి సీనియర్ నాయకుడు సతీష్ జార్కిహోలిని పరిగణించే అవకాశం ఉందన్న సంకేతాల నడుమ, ఆయన చుట్టూ రాజకీయ సందడి నెలకొంది. బెళగావిలోని ఆయన మద్దతుదారులు ఆయన పదోన్నతి కోసం ప్రత్యేక పూజలు చేశారు. సమాంతర పరిణామంగా, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్(Governor Thawar Chand Gehlot) సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించి, మంత్రి మండలిని తక్షణమే రద్దు చేశారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. అంతకుముందు, సిద్ధరామయ్య కాంగ్రెస్ నాయకత్వానికి, కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ విలువలకు తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూనే, అసెంబ్లీలో పార్టీ స్పష్టమైన మెజారిటీని కొనసాగిస్తోందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ శుక్రవారంనాడు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆమోదించారు. గవర్నర్ అందుబాటులో లేని కారణంగా, గురువారంనాడు సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్‌కు అందజేశారు. సిద్దరామయ్య సమర్పించిన రాజీనామా పత్రంలో "నేను కర్ణాటక ముఖ్యమంత్రిగా నా రాజీనామాను సమర్పిస్తున్నాను. దయచేసి దీనిని ఆమోదించండి." అని పేర్కొన్నారు.