బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళల ఆందోళన
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని చిచ్పల్లి, సోనాపూర్, గణేశ్‌పూర్, పోనగూడతో పాటు మొత్తం ఏడు గ్రామాలకు చెందిన మహిళలు తమ గ్రామాల్లో కొనసాగుతున్న అక్రమ మద్యం (బెల్ట్) షాపులను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండటం వల్ల పురుషులు మద్యానికి బానిసలై కుటుంబాలను పట్టించుకోవడం లేదని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యపానం కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, పిల్లల చదువులు మరియు కుటుంబ నిర్వహణ భారంగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్యపై గతంలో వాంకిడి ఎస్‌ఐకి వినతిపత్రం అందజేసినా తగిన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. దీంతో ఏడు గ్రామాల మహిళలు ఐక్యంగా జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టర్, ఎస్పీ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. తమ గ్రామాల పరిధిలో కొనసాగుతున్న సుమారు 10 బెల్ట్ షాపులను వెంటనే మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు నంది పద్మ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం రాజ్‌కుమార్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మద్దతు తెలిపారు.






