లొంగిపోయిన సిద్ధా ర్థ్‌రెడ్డి
- నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో రెండేళ్ల జైలు శిక్ష
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి వచ్చి, నాంపల్లి కోర్టులో లొంగుబాటు
- చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
- ప్రత్యూష తల్లి 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16 (విజయక్రాంతి): తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాల క్రితం పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రధాన నిందితుడు సిద్ధార్థ్‌రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. గత 24 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో సిద్ధార్థ్‌రెడ్డికి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
ఇన్నేళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, స్థిరపడిన ఆయన సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడానికి ముందే భారత్‌కు చేరుకుని న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. 2002 ఫిబ్రవరి 23న ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించారనే కారణంతో ఆత్మహత్యకు యత్నించారు. కూల్‌డ్రింకులో పురుగుల మందు కలుపుకుని ఇద్దరూ తాగగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించింది.
సిద్ధార్థ్‌రెడ్డి కోలుకున్నాడు. తన కుమార్తెది ఆత్మహత్య కాదని, సిద్ధార్థ్‌రెడ్డే పథకం ప్రకారం హత్య చేశాడని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి కేసు వేశారు. తొలుత ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు సిద్ధార్థ్‌రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, అక్కడి న్యాయస్థానం నేర తీవ్రతను పరిశీలించి శిక్షాకాలాన్ని ఐదేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది.
ఈ శిక్షను కూడా రద్దు చేయాలని కోరుతూ సిద్ధార్థ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, విచారణ సుదీర్ఘ కాలం పాటు సాగింది. చివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని భావించిన సుప్రీంకోర్టు, సిద్ధార్థ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. రెండేళ్ల శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేస్తూ, నాలుగు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం అమెరికా నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకున్న సిద్ధార్థ్‌రెడ్డి, 24 ఏళ్ల తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చాడు. భారీ భద్రత మధ్య ఆయన లొంగుబాటు ప్రక్రియ ముగిసింది. న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధించడంతో పోలీసులు వెంటనే చంచల్‌గూడ జైలుకు తరలించారు.




