17 March, 2026 | 1:14 AM

వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సిక్సర్

17-03-2026 12:00 AM

98వ ఆస్కార్ అవార్డుల వేడుక కన్నుల పండువగా జరిగింది. యావత్తు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుకకు లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్ వేదికైంది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ సినిమాలకు అవార్డుల పంట పండింది. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు దక్కాయి. ‘సిన్నర్స్’కు నాలుగు అవార్డులు వరించాయి. ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా..

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీల్లో సత్తా చాటగా, ‘సిన్నర్స్’ చిత్రానికి ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఈ వేడుకకు హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ పురస్కారాన్ని భారత నటి ప్రియాంక చోప్రా అందజేశారు. 

ఆస్కార్‌లో ఏడోసారి ‘టై’ 

98 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మరోసారి ‘టై’ చోటుచేసుకుంది. అంటే ఒకే కేటగిరీకి ఇద్దరు విజేతలుగా నిలిచారు. ‘బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్’ విభాగంలో ‘ది సింగర్స్’, ‘టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా’ చిత్రాలు ఎంపిక కావటం విశేషం. రెండు సినిమాలు ఇలా ‘టై’ కావడం ఇది ఏడోసారి. 1932లో ఉత్తమ నటుడు అవార్డును వాలెస్ బీరీ, ఫ్రెడ్రిక్ మార్చ్‌లకు అందజేశారు. 1949లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ‘ఏ ఛాన్స్ టు లివ్’, ‘సో మచ్ ఫర్ సో లిటిల్’లకు దక్కాయి. 1968లో ఉత్తమ నటి అవార్డును కేథరిన్ హెష్బర్న్, బార్బరా స్ట్రీసాండ్ పంచుకున్నారు.

1986లో ఉత్తమ ఫీచర్ డాక్యుమెంటరీ పురస్కారాన్ని ‘ఆర్టీ షా: టైమ్ ఈజ్ ఆల్ యూ హావ్ గాట్’, ‘డౌన్ అండ్ అవుట్ ఇన్ అమెరికా’లకు దక్కింది. 1994లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్) కేటగిరీలో ‘ఫ్రాంక్ కాఫ్కాస్ ఇట్స్ ఏ వండర్‌ఫుల్ లైఫ్’, ‘టైవర్’లకు అందజేశారు. 2012లో ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ కేటగిరీలో ‘స్కైఫాల్’, ‘జీరో డార్క్ థర్టీ’లకు అందజేశారు. 

ఆస్కార్ పురస్కారాల వివరాలివీ.. 

ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సిన్నర్స్)

ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)

ఉత్తమ సహాయ నటుడు: సీన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ సహాయ నటి: ఎమీ మాడిగన్ (వెపన్స్)

ఉత్తమ క్యాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిన్నర్స్

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సిన్నర్స్ 

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 

ఉత్తమ ఎడిటింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ 

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్ స్టుటైయిన్ 

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: అవతార్ ఫైర్ అండ్ యాష్

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ (నార్వే)

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్, టూ పీపుల్ ఎక్ఛ్సేంజ్ సలైవా

ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (కేపాప్ డిమాన్ హంటర్స్)

ఉత్తమ ఒరిజినల్ స్కోర్: సిన్నర్స్

ఉత్తమ సౌండ్: ఎఫ్ 1

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్ స్టైయిన్

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ఫ్రాంకెన్ స్టుయిన్ 

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: కేపాప్ డిమాన్ హంటర్స్ 

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హు క్రైడ్ పెరల్స్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్ 

కోట శ్రీనివాస్‌కు ఆస్కార్ నివాళి 

98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా సినీరంగం కోసం కృషి చేసిన గొప్ప కళాకారులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన కోట శ్రీనివాసరావుతోపాటు హాలీవుడ్ ప్రముఖులతోపాటు భారతీయ సినిమా నుంచి ధర్మేంద్ర, మనోజ్‌కుమార్, బీ సరోజాదేవి వంటి దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచింది.

నిరుడు మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు నివాళులర్పిస్తూ వీడియోను వేడుక ప్రారంభంలో ప్రదర్శించారు. దివంగత నటీనటులతో ఉన్న జ్ఞాపకాలను కొందరు ఈ వేదికపై పంచుకున్నారు. అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న కోట శ్రీనివాస్‌కు ఆస్కార్ నివాళులర్పించటం పట్ల తెలుగు చిత్రపరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. 

రెడ్ కార్పెట్‌పై అంబానీల అమ్మాయి 

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ కూడా ఈ వేడుకల్లో సందడి చేశారు. ఈషా తన భర్త ఆనంద్ పిరమాల్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అంతకన్నా ముందు ఈషా.. అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌ను సందర్శించారు.

అక్కడ మ్యూజియం డైరెక్టర్, ప్రెసిడెంట్ అమీ హోమ్మాతో జరిగిన సమావేశంలో సినిమా, కళలు, సాంస్కృతిక కథనాలపై సుదీర్ఘంగా చర్చించారు. సినిమా రంగంపై తనకున్న ఆసక్తిని, వ్యాపారవేత్తగా కళారంగానికి అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఈషా గుర్తు చేసుకున్నారు.