డైరెక్టర్ జెన్-జీ.. సిగ్మా టైటిల్ అందుకేనా!
సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సిగ్మా’. జేసన్ సంజయ్(Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలంగాణ, కోస్తాంధ్రలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ విడుదల చేస్తోంది. అక్టోబర్ 2న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. “ఒక వేడుకకు రావడం బాధ్యతగా భావిస్తాను.
సందీప్ మా కుటుంబ సభ్యుడిలాంటివాడే. సంజయ్ తాత నాకు ‘చట్టానికి కళ్లులేవు’, ‘దేవాంతకుడు’ లాంటి అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు. అలాగే విజయ్ సినిమాలకూ ముహూర్తానికి వెళ్లాను. తన తాతలాగే సంజయ్ కూడా ప్యాషన్‌తో డైరెక్షన్‌లో ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సందీప్ చాలా వెరైటీ సినిమాలు చేస్తుంటాడు. ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకతను నిరూపించుకోవాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది.
‘సిగ్మా’ అంటే తనకు నచ్చింది చేసే వ్యక్తి. అందుకే ఈ జెన్-జీ భాషలోనే అలాంటి ఒక యంగ్ డైరెక్టర్ సినిమాకి ఈ టైటిల్ పెట్టారని అనుకుంటున్నాను. ఇది చాలా కొత్త ఆలోచన. ఈ సినిమా ఫస్ట్ కాపీ నాకు చూపించాలని కోరుతున్నాను. పరిశ్రమకి కొత్తవాళ్లు రావాలి. పరిశ్రమ కొత్త పుంతలు తొక్కాలి. తెలుగు పరిశ్రమలో ఎవరైనా సరే మంచి కంటెంట్ ఇస్తే వాళ్లకి స్వాగతం చెప్తాం. సంజయ్ చేసిన సినిమాని తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు, సూపర్ హిట్ చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “సిగ్మా’ ఫన్, యాక్షన్, కామెడీ. ఇది నా సినిమా లేదా విజయ్ గారి అబ్బాయి సినిమా అని కాదు. స్వయంకృషితో, తన కష్టం మీద తానే నిలబడతానని ఒక 24 ఏళ్ల దర్శకుడి కల తప్పకుండా ఈ సినిమా మీరందరూ థియేటర్లో చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపారు. డైరెక్టర్ జేసన్ సంజయ్ మాట్లాడుతూ.. “ఇది సినిమా యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ప్రతి ఒక్కరూ సినిమాకి కనెక్ట్ అవుతారు. అక్టోబర్ 2న అందరి ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను.
మెగాస్టార్ చిరంజీవి బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ నా లాంటి డెబ్యూ ఫిలిం మేకర్‌ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆయన మా అందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “చిరంజీవిని ఎప్పుడు కలిసినా నాలో ఉన్న డాన్సర్ బయటికి వస్తుంది. అంతగా ఇన్‌స్పైర్ చేసిన చిరంజీవికి థాంక్యూ. ఆయన ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ‘సిగ్మా’ను సంజయ్ చాలా అద్భుతంగా తీశాడు” అని చెప్పింది. నిర్మాత నవీన్ ఎర్నేని, సంగీత దర్శకుడు తమన్, డీవోపీ చోటా కే నాయుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్‌తోపాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.