calender_icon.png 20 July, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరళతరంగం

20-07-2025 12:34:57 AM

  1. స్టుఫైన్ సిస్టంతో వరద నీటి పీడనంతో ఆటోమెటిక్‌గా తెరుచుకునే గేట్లు
  2. 1950దశకంలోనే కొత్త టెక్నాలజీతో నిర్మాణం
  3. వనపర్తి జిల్లాకే తలమానికంగా సరళసాగర్ ప్రాజెక్టు
  4. తల్లి పేరు మీద ప్రాజెక్టుకు సంస్థానాధీశుల రూపకల్పన 
  5. ఆసియా ఖండంలోనే మొదటిది, ప్రపంచంలో రెండోదిగా పేరు

నీటి నిల్వకు మించి వరద నీరు వచ్చినప్పుడు సంబంధిత అధికారులు ప్రాజెక్టు గేట్ల ను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం అందరికీ తెలిసిందే. కానీ సరళ సాగర్ ప్రాజె క్టు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ప్రాజెక్టులో వరద నీరు వచ్చి నీటి నిల్వ సరిపడా ఉన్నట్లయితే మానవ, యంత్రాల ప్రమేయం లేకుండా నీటి నుంచి ఉత్పన్నమయ్యే పీడనం వల్ల ఆటోమెటిక్‌గా నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వచ్చేలా స్టైఫన్ సిస్టంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.

సరళసాగర్ చరిత్ర..  

వనపర్తి సంస్థానధీశుల కాలంలో ప్రస్తుత వ నపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శంకరమ్మపేట గ్రా మశివారులో నిర్మించిన సరళసాగర్ ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉంది. 1947 జూలై 10వ తేదీన వనపర్తి సంస్థానాధీశులైన రాజా రామేశ్వరరా వు తన తల్లి సరళాదేవి పేరుమీద ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇంజినీరు పీఎస్ రామకృష్ణ ఆటోమేటిక్ సిస్టం(స్టైఫన్) గురించి రామేశ్వరరావుకు వివరించారు. ఈ పద్ధతిలో ప్రాజెక్టు చేపడితే బాగుంటుందని వెంటనే పనులు ప్రారంభించాలని ఇంజనీర్‌కు ఆయన సూచించారు.

ప్రాజెక్టు కింద పది గ్రామాలకు 4,182 ఎకరాల ఆయకట్టుకు సాగనీరు అందించేలా డిజైన్ రూపొందించారు. రాజా రామేశ్వరరావు అదేశాల మేరకు అప్పటి ఇంజినీర్లు రూ.35 లక్షల వ్యయంతో 1947 జూలై 10న ప్రారంభించి 1959లో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 

ఆటోమెటిక్ స్టైఫన్లు..

1959 జులై 26వ తేదీన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి నర్సింగరావు మొదటిసారి గా కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. 1960లో మొదటిసారిగా స్టైఫన్లు తెరుచుకోగా.. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు భారీ వర్షాలు కురవడంతో 1963 వరకు స్టైఫన్లు ఓపెన్ అయ్యాయి. 1964లో అతి భారీ వర్షాలతో శంకర్ సముద్రం ఆనకట్టకు గండి పడి సరళసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ఆనకట్ట తెగిపోయింది.

ఈ క్రమంలోనే నీటి ఉధృతిని తట్టుకునేలా అలుగులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1967, 1970,1974 1981, 1988, 1990, 1991, 1993, 1998, 2009లో స్టైఫన్లు ఓపెన్ అయ్యాయి. 2019 డిసెంబర్ 31న స్టైఫన్లు తెరుచుకునే సమయంలో ప్రాజెక్టు ఎడమ పక్కన ఉన్న కట్ట బలహీనపడి తెగిపోయింది.

దీంతో గత ప్రభుత్వ హయాంలో యుద్ధప్రాతిపదికన 7 నెలల కాలంలో ఆనకట్టను పునరుద్ధరించి రైతులకు సాగనీరు అందించారు. తిరిగి 2021, 2022, 2023,  2024లో మళ్ళీ స్టైఫన్లు ఓపెన్ అయ్యాయి.

ప్రాజెక్టు సామర్థ్యం..

సరళసాగర్ ప్రాజెక్టును 0.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 771ఎకరాల్లో 1,372 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లతో ప్రాజెక్టు విస్తరించి ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,089 అడుగులు కాగా 1,089.25 అడుగుల వరకు నీరు చేరితే ఆటోమెటిక్‌గా స్టైఫన్లు తెరుచుకుంటాయి.

ప్రాజెక్టు బెడ్ లెవల్ 1,054  అడుగులు ఉండగా 1,067 అడుగులకు నీరు చేరితే ఎడమ కాలువ నుంచి, 1072 అడుగులకు చేరితే కుడి కాలువల ద్వారా నీరు విడుదల అవుతుంది. ఎడమ కాల్వ ద్వారా 82 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యి 16 కిలోమీటర్ల పాటు ప్రవహించి 8 గ్రామాల్లోని 3,769.20 ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 6.89 క్యూసెక్కుల నీరు విడుదల అయ్యి 4.50 కిలోమీటర్లు ప్రవహించి రెండు గ్రామాల్లోని 388.62 ఎకరాలకు సాగునీరు అందుతుంది.  

ఆసియా ఖండంలోనే మొదటిది.. 

స్టైఫన్ సిస్టంలో నిర్మించిన సరళసాగర్ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే మొదటిదిగా ప్రపంచంలో రెండోదిగా పేరు గాంచింది. స్టైఫన్ సిస్టంతో దిగువకు నీటిని విడుదల చేసే విధంగా 0.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 17 ఉడ్ స్టైఫన్లు, 4 ప్రైమరీ స్టైఫన్లు ఏర్పాటుచేసి ప్రాజెక్టు నిర్మించారు.

ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 10 గ్రామాల్లో 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఒక్క ఉడ్ స్టైఫన్ నుంచి 3,440, ప్రైమరీ స్టైఫన్ నుంచి 500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది.