calender_icon.png 20 July, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాలీబాల్ ఆటంటే ఇనుగుర్తోళ్లదే!

20-07-2025 12:38:33 AM

  1. వందలాది మంది క్రీడాకారులను తీర్చిదిద్దిన ‘కొమురయ్య సార్’

జిల్లా స్థాయి నుంచి దేశ స్థాయి వరకు గ్రామ క్రీడాకారుల హవా

జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన కన్నా వెంకటనారాయణ

స్పోర్ట్స్ కోటాలో వందలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

‘ఖేలో ఇండియా వాలీబాల్ సెంటర్’ ఏర్పాటు చేయాలంటున్న గ్రామస్థులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాలీబాల్ క్రీడకు పెట్టింది పేరు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి. 1970లో ఆ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు కందునూరి కొమురయ్య కృషితో వందల మంది విద్యార్థులు వాలీబాల్ క్రీడలో రాణించారు. 80 మందికిపైగా జిల్లా స్థాయి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 8 మంది భారత వాలీబాల్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారంటే ఇనుగుర్తి వాసులకు వాలీబాల్ క్రీడపై ఉన్న మక్కువను తెలియజేస్తుంది.

అప్పట్లో గ్రామంలో ఇంటికొకరు లేదా ఇద్దరు వాలీబాల్ ఆటగాళ్లు ఉండేవారు. ఇనుగుర్తికి చెందిన కన్నా వెంకటనారాయణ వాలీబాల్ క్రీడలో  నైపుణ్యం సాధించి భారత వాలీబాల్ జట్టు సీనియర్ విభాగంలో స్థానం సంపాదించారు. జిల్లా స్థాయి నుంచి మొదలుకొని జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనకీర్తి సాధించడానికి గ్రామంలో వాలీబాల్ క్రీడానైపుణ్యాన్ని పెంపొందించడానికి ‘కొమురయ్య’ సార్ చేసిన కృషి నిరూపమానం.

పాఠశాలకు వచ్చే విద్యార్థులకు కేవలం చదువు చెప్పడమే కాకుండా క్రీడల్లో రాణించడానికి కొమురయ్య సార్ చేసిన సేవలు మరువలేనివి. విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు జట్టులో ఎక్కడ ఏ విధంగా ఆడాలో గుర్తించి అలాంటి వారిని ప్రోత్సహించేవారు. వాలీబాల్ క్రీడకు విశేషంగా కృషి చేసిన ‘కొమురయ్య’ సార్ మరణానంతరం ఆయనను నిత్యం స్మరించుకునే విధంగా గ్రామంలో ఆయన శిలా విగ్రహం ఏర్పాటు చేశారు.

కొమురయ్య సార్ తర్వాత వాలీబాల్ క్రీడాభివృద్ధి కోసం సట్ల బిక్షం, కందునూరి పిచ్చయ్య, కన్నా సాంబయ్య కూడా విశేషంగా పాటుపడ్డారు. 2005 వరకు జిల్లాస్థాయి నుంచి మొదలుకొని జాతీయస్థాయి వరకు జరిగే వాలీబాల్ క్రీడలో ఇనుగుర్తికి చెందిన ఒకరిద్దరూ క్రీడాకారులు జట్టులో ప్రాతినిధ్యం ఉండడం పరిపాటిగా మారింది. అలాగే అప్పట్లో ప్రతీ ఇంట్లో బాలబాలికలు తేడా లేకుండా ఒకరిద్దరూ కచ్చితంగా వాలీబాల్ క్రీడాపోటీల్లో పాల్గొనేవారు.

ఇనుగుర్తిలో వాలీబాల్ క్రీడలో  బాలుర జట్టుతోపాటు బాలికల జట్టు కూడా ఉండడం ప్రత్యేకతగా నిలిచేది. ఎక్కడ వాలీబాల్ పోటీలు జరిగినా అక్కడ ఇనుగుర్తి నుంచి బాలబాలికల వాలీబాల్ జట్టు పోటీలో ఉండడం అప్పట్లో ప్రత్యేకతగా చెప్పుకునేవారు.

వాలీబాల్ క్రీడతో ‘స్పోర్ట్స్ కోటా’లో ఇనుగుర్తికి చెందిన సుమారు 200 మందికి పైగా క్రీడాకారులు ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకున్నారు. సుమారు 80 మందికి పైగా వాలీబాల్ క్రీడ ద్వారా ఆర్టీసీ, పోస్టల్, ఎల్‌ఐసీ, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇతర ప్రభుత్వ శాఖలతోపాటు పీఈటీలుగా ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడడం మరో విశేషం. 

క్రమక్రమంగా తగ్గుతున్న ఆసక్తి

2005 సంవత్సరం వరకు వాలీబాల్ క్రీడకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఇనుగుర్తిలో వాలీబాల్ క్రీడపై క్రమక్రమంగా ఆసక్తి తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం పిల్లల చదువులే ప్రాధాన్యంగా తల్లిదండ్రులు గుర్తించడం, జనరేషన్ కూడా తగ్గడం, గ్రామంలో క్రీడాపోటీలు, శిక్షణకు అనువైన పరిస్థితులు కల్పించకపోవడం కారణంగా మారింది. దీనికి తోడు తమ పిల్లలను చదువు కోసం ఇతర ప్రాంతాలకు పంపడం వల్ల వాలీబాల్ క్రీడపై ఆసక్తి తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. 

వాలీబాల్ జాతీయ సీనియర్ జట్టు కెప్టెన్‌గా వెంకట్‌నారాయణ

ఇనుగుర్తికి చెందిన కన్నా వెంకట్‌నారాయ ణ వాలీబాల్ క్రీడలో ‘బూస్టర్’ ప్రత్యేక నైపు ణ్యం సాధించి భారత జాతీయ వాలీబాల్ జ ట్టుకు ఎంపికయ్యారు. తన క్రీడా నైపుణ్యంతో తర్వాత భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు.

1985 నుంచి 1995 వరకు వెంకట్ నారాయణ సారథ్యంలో భారత వాలీబాల్ సీనియర్ జట్టు సౌత్ ఏషియా ఫెడరేషన్ క్రీడా పోటీల్లో రెండుసార్లు భారతదేశానికి గోల్డ్ మెడల్, ఒకసారి సిల్వర్ మెడల్ సాధించి పెట్టారు. ప్రస్తుతం వెంకటనారాయణ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఖేలో ఇండియా వాలీబాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి

జిల్లా నుంచి మొదలుకొని భారతదేశ వాలీబాల్ జట్టుకు మూడు దశాబ్దాల పాటు క్రీడాకారులను తీర్చిదిద్ది అందించిన ఇనుగుర్తిలో ఖేలో ఇండియా వాలీబాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇనుగుర్తిలో వాలీబాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే తిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాలీబాల్ క్రీడాభివృద్ధికి దోహదపడుతుంది.

ఆ దిశగా ఇనుగుర్తికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కృషి చేయాలి. శిక్షణ కోసం అవసరమైన మౌలిక వసతులకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలి. దీనిద్వారా ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడకు పూర్వ వైభవం దక్కుతుంది. 

 జంపయ్య, జాతీయ వాలీబాల్ జట్టు పూర్వ క్రీడాకారుడు, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ కోచ్