calender_icon.png 20 July, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోల్ మోడల్ స్కూల్!

20-07-2025 12:32:12 AM

  1. లీడర్లు సిఫార్సు చేసినా నో అడ్మిషన్

మహబూబాబాద్ ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్

ప్రభుత్వ పాఠశాల ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు తెచ్చినా సీట్లు లభించడం లేదంటే ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు అంత డిమాండ్ మరి. ఇక్కడ ఆరు  నుంచి పదో తరగతి వరకు తరగతికి వందమంది చొప్పున ప్రవేశం కల్పిస్తారు. అలాగే ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ విభాగంలో 40 మంది విద్యార్థుల చొప్పున అడ్మిషన్లు ఇస్తారు.

యేటా పాఠశాల స్థాయిలో 500 మంది, కళాశాల స్థాయిలో 120 మందికి మాత్రమే మహబూబాబాద్ మోడల్ స్కూల్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ స్కూల్‌లో ప్రవేశం లభించిందంటే విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డట్టే. ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సాధిస్తున్న ప్రగతే అందుకు నిదర్శనం. గడిచిన కొంతకాలంగా పది ఫలితాల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు, ఇంటర్మీడియెట్‌లో 80 శాతం ఉత్తీర్ణత సాధించి, మహబూబాబాద్ జిల్లాకే ‘రోల్ మోడల్’ స్కూల్ గా నిలుస్తోంది.

2024- విద్యా సంవత్సరంలో 95 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఈ పాఠశాలకు చెందిన అభిలాష్ అనే విద్యార్థి పది ఫలితాల్లో 600 మార్కులకు 582 మార్కులు సాధించి మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ విద్యాసంస్థల్లో టాపర్‌గా నిలిచాడు. బాసర ట్రిపుల్ ఐటీలో ఏకంగా ఈ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఈ ఏడాది సీట్లు దక్కించుకోవడం మరో విశేషం. 

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన సమిత, అక్షయ, కావ్యశ్రీ, వేణు, గణేశ్, హేమంత్ కార్తీక్, ఎండీ ఉజ్మ, ఎస్‌కే సానియా, నిహారిక, మల్లిక, దేవేందర్ ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించి ఔరా అనిపించారు. పాఠశాలలో చేరిన విద్యార్థుల పట్ల అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిపెట్టడం, చదువులో వెనుకబడ్డ విద్యార్థుల పట్ల మరింత శ్రద్ధ చూపడం, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను వారికి అందించి, అంకితభావంతో పనిచేయడంతో ఇది సాధ్యమైంది. పాఠశాల ప్రారంభంలోనే సీట్లు నిండటంతో.. స్కూల్ బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టారంటే ఈ పాఠశాల ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 

విద్యాబోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి

మహబూబాబాద్ మోడల్ స్కూల్ లో చదువుకుంటున్నవారికి చక్కని విద్యాబోధనను అందించడంతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధి పెంపుదల కోసం కృషి చేస్తున్నాం. ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా బోధించడానికి 18 మంది రెగ్యులర్ ఉపాధ్యాయులం నిరంతరం కృషి చేస్తున్నాం.

దీనికి తోడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ ద్వారా ఆన్‌లైన్ తరగతులు బోధిస్తూ ప్రతి విద్యార్థిని ఆయా సబ్జెక్టుల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నాం. వందమంది నిరుపేద బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది కూడా ఇదే స్ఫూర్తితో ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.  

గండి ఉపేందర్ రావు, ప్రిన్సిపల్ మహబూబాబాద్, మోడల్ స్కూల్