ఆస్తి కోసం అక్క హత్య
- ముక్కలు చేసి చెరువులో పడేసిన తమ్ముడు
అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 18: ఆస్తి కోసం అక్కను చంపిన తమ్ముడు.. మృతదేహాన్ని ముక్కముక్కలు చేసిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజస్థాన్ రాష్ట్రం జోద్‌పూర్‌కు చెందిన లీలాదేవి (45) ఉపాధి నిమిత్తం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి బాటసింగారంలో కిరాణం షాపు నిర్వహిస్తోంది. ఆమెకు వరుసకు తమ్ముడైన పప్పురామ్ కుమావత్‌తో కలిసి గతంలో ఒక ప్లాటు కొనుగోలు చేసింది. ఆ ప్లాటును పప్పు రామ్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో, తన వాటా కోసం లీలాదేవి అతడితో గొడవ పడుతోంది.
ఈ క్రమంలోనే ఆస్తిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో పప్పురామ్ ఆమెను వదిలించుకోవాలని పథకం వేశాడు. గత నెల 28న గొడవ జరుగుతున్న సమయంలో పప్పురామ్.. లీలాదేవిని హత్య చేశాడు. అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని రెండు రోజుల పాటు వాష్‌రూంలోనే ఉంచాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కవర్లలో ప్యాక్ చేసి మజీద్‌పూర్ సమీపంలోని అక్కచెల్లెళ్ల చెరువులో పడేశాడు.
ఏమీ తెలియనట్టుగా తన సొంత ఊరు రాజస్థాన్‌కు వెళ్లి, అక్క కనిపించడం లేదం టూ బంధువుల వద్ద నాటకమా డాడు. వారి సూచన మేరకు ఈ నెల 8న అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పప్పు రామ్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఆస్తి కోసమే తాను ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బుధవారం పోలీసులు చెరువులో గాలించి లీలాదేవి శరీర భాగాలను వెలికితీశారు. పప్పురామ్‌తోపాటు సహకరించిన రాకేష్, సునీల్‌కుమార్ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.




