3 July, 2026 | 7:10 AM

చిన్న సినిమా.. పెద్ద హిట్

28-12-2024 12:23 AM

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయన్నది నానుడి.. ఇది సినిమాకూ వర్తిస్తుంది. చిన్న సినిమా ఏముందిలే అని లైట్ తీసుకోవడానికీ లేదు. పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకోవడానికీ లేదు. ఎన్నో అంచనాలతో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద చతికలబడవచ్చు. చిన్న సినిమా ఏముందిలే అంటే బాక్సాఫీస్‌ను షేక్ చేయనూ వచ్చు. కంటెంట్ అద్భుతంగా ఉంటే సినిమా ఎక్కడికో వెళ్లిపోతుంది. కేవలం మౌత్ టాక్‌తో సినిమా రేంజ్ పెరిగిపోతుంది. ‘కల్కి, దేవర, పుష్ప 2’ సినిమాలు మినహా పెద్దగా ఏవీ కూడా సంచలన విజయాన్ని నమోదు చేయలేదు. కానీ చిన్న సినిమా లిస్ట్ బాగానే ఉంది. అలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రాలు 2024లో కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఈ ఏడాది జనవరిలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఏమాత్రం అంచనాలు లేవు. అసలెవరూ ఈ చిత్రం గురించి పట్టించుకోలేదు. కానీ తొలిరోజు మౌత్ టాక్ ఈ చిత్రానికి ప్రాణమైంది. అంతే.. విడుదల తర్వాత బీభత్సమైన హైప్ వచ్చింది. బాక్సాఫీస్ గడగడలాడింది.

ప్రస్తుతం దీనికి సీక్వెల్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. మార్చిలో ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా రూపొందిన ‘టిల్లు స్కేర్’ విడుదలైంది. వాస్తవానికి ‘డీజే టిల్లు’ చిత్రం ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చింది. పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఆ తరువాత ‘టిల్లు స్కేర్’ కూడా చిన్న సినిమాయే కానీ ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచకపోగా పెద్ద విజయం సొంతం చేసుకుంది. 

రూ.20 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు

ఇక ఏప్రిల్ విషయానికి వస్తే ‘మంజుమ్మల్ బాయ్స్’ అనే ఒక చిన్న సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మలయాళ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక మంచి హైప్ వచ్చింది. చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు.

కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో రూ.200 కోట్లు రాబట్టింది. తెలుగులోనూ ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో ‘కమిటీ కుర్రాళ్లు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఉందని కూడా పెద్దగా ప్రేక్షకులకు తెలియదు. ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రమే. కానీ సినిమా మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. అంతే సినిమా మంచి సక్సెస్ సాధించింది.

ప్రేక్షకులకు పండుగ రుచి చూపించిన అక్టోబర్..

అక్టోబర్ సినీ ప్రియులకు పండగ లాంటిదని చెప్పాలి. ఈ నెలలో మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. దసరా కానుకగా వచ్చిన మూడూ ఒకే సమయంలో విడుదలైనా కూడా వేటికవే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడు కూడా చిన్నవే కావడం గమనార్హం. ‘అమరన్, లక్కీ భాస్కర్, క’ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మూడు కూడా వేర్వేరు జానర్స్‌లో రూపొందినవే.

అద్భుతమైన బయోపిక్‌గా రూపొందిన ‘అమరన్’ చిత్రం వసూళ్ల సునామీ కొనసాగించింది. సామాన్యుడి జీవితం, బ్యాంక్ స్కామ్ ఆధారంగా రూపొందిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం అంచనాలను మించి మరీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ‘క’ చిత్రం రూపొందింది. ఇది కూడా అంచనాలకు మించి సక్సెస్‌ను అందుకుంది.