calender_icon.png 19 February, 2026 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు

19-02-2026 03:41:56 PM

రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి,

కల్వకుర్తి: వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని,ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి అన్నారు. గురువారం రైతు కమిషన్ బృందం నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) అచ్చంపేట నియోజకవర్గం  వంగూర్ మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. అనంతరం మినీ కిట్ల పంపిణీ, భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి(Kodandarami Reddy,) మాట్లాడుతూ.. భూసార అభివృద్ధి , అధిక దిగుబడుల సాధనలో మట్టి పరీక్ష అత్యంత కీలకమని  పేర్కొన్నారు. రైతులు పంటలు విత్తే ముందు తప్పనిసరిగా తమ భూముల మట్టి పరీక్ష చేయించుకోవాలని  సూచించారు.మట్టి పరీక్ష ద్వారా భూమిలో ఉన్న పోషక పదార్థాల స్థాయి, పిహెచ్ విలువ, సేంద్రియ పదార్థాల శాతం వంటి కీలక వివరాలు తెలుసుకోవచ్చని  తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా సరైన ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పంటల ఎంపిక చేయడం సులభమవుతుందని అవసరానికి మించి ఎరువులు వేయడం వల్ల రైతులకు ఆర్థిక నష్టం కలగడంతో పాటు భూమి సారంపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. మట్టి పరీక్ష ద్వారా అవసరమైన ఎరువులనే వినియోగించడం సాధ్యమవుతుందని, దీనివల్ల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం అవసరమని, అందులో మట్టి పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందని, రైతులు ప్రభుత్వ వ్యవసాయ విభాగం ద్వారా అందుబాటులో ఉన్న మట్టి పరీక్ష సేవలను వినియోగించుకోవాలని అన్నారు,  రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులను తగ్గించి, స్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. 

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ(Achampet MLA Dr. Vamsi Krishna) మాట్లాడుతూ  దేశ వ్యవసాయ రంగ అభివృద్ధిలో తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని , దూరదృష్టితోనే హరిత విప్లవానికి బలమైన పునాదులు పడినట్లు తెలిపారు. నేడు దేశంలో రెండు సంవత్సరాలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం ఆయన చేపట్టిన విధానాల ఫలితమేనని అన్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతను ప్రోత్సహించడం, భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టుల నిర్మాణం వ్యవసాయ రంగానికి బలాన్ని ఇచ్చాయని వివరించారు.  వ్యవసాయ పరిశోధనా సంస్థల స్థాపన ద్వారా రైతులకు శాస్త్రీయ పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.

ఇదే తరహాలో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాలతో పాటు, గత పది సంవత్సరాలుగా రైతులకు అందని వ్యవసాయ పనిముట్లను మళ్లీ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారని, రైతులకు అవసరమైన యూరియా ఎరువుల పంపిణీ సమర్థవంతంగా చేపడుతూ రైతులకు వ్యవసాయం లవ సాటిగా జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.  నల్లమల్ల ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ ప్రాంతంలో ముఖ్యమంత్రి స్వగ్రామంలో రైతు కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన భూసార పరీక్ష కార్యక్రమాలను చేపట్టడం ఆయన ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Nagarkurnool District Collector Badavath Santosh) మాట్లాడుతూ.. రసాయన ఎరువులను అధికంగా వాడడం వల్ల, కేవలం పంట దిగుబడి తగ్గిపోతుందని మాత్రమే కాదు, పెట్టుబడులు ఎక్కువగా ఖర్చవుతాయని, అలాగే మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం కలగవచ్చని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. పంటలకు సరిపడే వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాల మేరకు ఎరువులను పంటలకు వినియోగించుకోవాలని, రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టిన భూసార పరీక్షలతో వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయని, రైతులకు లాభంతో పాటు నేల సాంద్రతను పెంచుకొని ఆరోగ్యకరమైన పంటల సాగు జరుగుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఉమ్మడి జిల్లాలో కేవలం జడ్చర్ల పట్టణంలో మాత్రమే భూసార పరీక్షలు నిర్వహించే కేంద్రం ఉందని, భూసార పరీక్షలకు సమయం పడుతుందని ప్రభుత్వం గ్రహించి రైతుల వద్దకే పరీక్షలు నిర్వహించేలా నేడు రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కమిషన్ రైతు కేంద్రాల వద్దకి భూసార పరీక్షలను తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో

రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు కేవీ నర్సింహారెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్,మరికంటి భవానీ రెడ్డి,భూమి సునీల్ ,రాంగోపాల్ రెడ్డి, రాములు నాయక్ , గంగాధర్,  గ్రామ సర్పంచ్ మల్లేపల్లి వెంకటేష్, రైతు సంక్షేమ కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు సుచిత్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయ ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ బ్రజేంద్ర, డాక్టర్ రాంప్రకాష్, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, వ్యవసాయ అధికారులు  రేవతి, చంద్రశేఖర్, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.