27 February, 2026 | 4:42 AM

గోదావరి పుష్కరాలకు పటిష్ట ప్రణాళికలు

27-02-2026 01:04 AM

అధికారులతో కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్ష 

నిర్మల్, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి): గోదావరి నది పుష్కరాల నిర్వహణకు ఇప్పటినుంచే పటిష్ట ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న గోదావరి పుష్కరాలు నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంను దర్శించుకో వడానికి, అలాగే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రాం తాల వారీగా పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, పుణ్యస్నానాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. భక్తులకు వసతి, త్రాగునీరు, శాశ్వత, మొబైల్ టాయిలెట్లు, లైటింగ్ తదితర మౌలిక సదుపాయాలు సమకూర్చాలని పేర్కొన్నారు. పారి శుధ్య కార్యక్రమాలను నిరంతరం చేపట్టాలని, జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్ల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించా రు. ఈ సమావేశంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీలు రాజేష్ మీనా, సాయికిరణ్, డిపివో శ్రీనివాస్, ఈఈ ఆర్డబ్ల్యూఎస్ సందీప్, బాసర ఆలయ ఈవో విజయరామారావు పాల్గొన్నారు.