తెలుగు చరిత్రకు తెలంగాణే మూలం
తెలంగాణ ఏ ప్రాంతం వారినైనా ఆదుకుంటుంది, అక్కున చేర్చుకుంటుంది. అలాగే ఆకలినైనా సహిస్తుంది కానీ, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఏ చర్యను తెలంగాణ సహించదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.
ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి వేదికగా మే 27న జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో ఆ పార్టీ తెలంగాణ అడహక్ కమిటీ చైర్మన్ బక్క నరసింహులు ‘తెలంగాణ’ అనే పదం అసలు డిక్షనరీలో కూడా లేదని మాట్లాడటం యావత్ తెలంగాణ సమాజాన్ని విస్మయానికి, అసహనానికి, ఆవేదనకు, ఆక్రోశానికి గురిచేసింది. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తెలంగాణేతరుడైతే అంతగా బాధించేది కాదు. ఇక్కడ ఆయన వ్యాఖ్యలను మనం రెం డు కోణాల్లో చూడొచ్చు. ఒకటి, అతనికి తెలంగాణపై అవగాహన లేకపోవడం.
రెండు, తన పార్టీ అధినేత మెప్పు కోసం అయ్యుండొచ్చు. ఏదేమైనప్పటికీ పరాయి రాష్ట్ర వేదికపై ఒక తెలంగాణ వ్యక్తి అయ్యుండి సొంత ప్రాంతాన్ని కించపరుస్తూ, తక్కువచేస్తూ, తెలంగాణ చరిత్రపై తనకు ఉన్న అవగాహనరాహిత్యాన్ని, మొత్తం ప్రాంతానికి ఆపాదిస్తూ, తెలంగాణ అ నే పదం చరిత్రలో లేదని, తెలంగాణకు అసలు చరిత్రే లేదన్నట్లు మాట్లాడటం సిగ్గుచేటు, శోచనీయం.
తెలంగాణ ఉత్తర, దక్షిణ భారతదేశ సంఘ మ స్థానం. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో మన దేశంలోని అతి ప్రాచీన, అతి పెద్ద, ప్రధాన నదులైన గోదావరి, కృష్ణాల మధ్య ప్రాంతాల్లో విస్తరించి, చారిత్రక పూర్వ యుగం నుంచి సమకాలీన చరిత్ర వరకు భారతదేశపు ఇతర ప్రాంతాలతో సరితూగే చారిత్రకత, విశిష్టతలు, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతమే తెలం గాణ. తెలంగాణ అనే పదం అత్యంత ప్రాచీనమైనది. తెలుగు ప్రాంతాల్లో మూడు శైవక్షే త్రాలు ఉండటం వల్ల ఏర్పడిన త్రిలింగ శబ్దం నుంచి తెలంగాణ వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం.
క్రీ.శ.1418లో వేసిన తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ పదాన్ని తొలిసారిగా ప్రస్తావించారు. ఒరిస్సా పాలకుడు ప్రతాపరుద్ర గజపతి క్రీ.శ.1510లో వేయించిన వెలి చర్ల శాసనంలోనూ తెలంగాణ పద ప్రయోగం ఉంది. అంతేకాదు, తెలంగాణ పదం లేదని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వేయించిన శాసనంలోనూ తెలంగాణ పద ప్రయో గం ఉంది. విదేశీ రచయితలు అమీర్ ఖుస్రో ‘తెలంగి’ పేరుతో తెలంగాణ భాషను ప్రస్తావించారు.
మరో ప్రముఖ విదేశీ రచయిత, మొ ఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ ‘ఐన్ తెలంగాణను ప్రత్యేక సుబాగా ప్రస్తావించిన సందర్భాలను గమనించవచ్చు. వాయు, మార్కండేయ పురాణాల్లోనూ ‘తిలింగ’, ‘త్రిలింగ’ పదాల ప్రస్తావన ఉంది. అంటే తెలంగాణ పదం మీ డిక్షనరీలు పుట్టకముందే వందల ఏండ్ల క్రితం శాసనాల్లోనే కాక, అనేక చారిత్రక గ్రంథాల్లోనూ లిఖితమైంది. శబ్దరత్నాకరం వంటి ప్ర ముఖ నిఘంటువులతో పాటు అనేక ప్రాచీన నిఘంటువుల్లోనూ తెలంగాణ ప్రస్తావనలు ఉన్నాయి.
చారిత్రకంగా శాతవాహనులు మొదలుకొని ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేముల వా డ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కుం దూరు చోళులు, ఎలకుర్తి రేచర్ల వంశం, చెరు కు రెడ్డి వంశం, తదనంతరం కాకతీయ సా మ్రాజ్యం, ఆ తర్వాత కాలంలో కొనసాగిన రెడ్డి నాయక, ముసునూరి నాయక రాజ్యం, పద్మనాయక రాజ్యం, ఆ తర్వాత గోల్కొండ కేంద్రం గా గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కుతుబ్ షాహీల వంశం, ఆఖరుగా రెండు దశబ్దాలకు పైగా పాలించిన అసఫ్‌జాహీల వరకు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక,
మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాలను కలుపుకొని తెలంగాణ కేంద్ర స్థానంగా, రాజధాని ప్రాంతంగా, పాలనా కేం ద్రంగా ఉంటూ వచ్చిన చరిత్ర గమనాన్ని అ ర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ ఇతర ప్రాంతాలతో కలుపుకొని ప్రధాన పరిపాలన కేంద్రంగా ఉంటూ వచ్చింది తప్ప, ఏనాడూ వేరే ప్రాంతాల కేంద్రంగా కొనసాగించిన రా జ్యాల పరిధిలో ఈ ప్రాంతం లేదని అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే బక్క నరసిం హు లు ఆ వేదికపైన మాట్లాడిన మంగళగిరి కూ డా తెలంగాణ కేంద్రంగా సాగిన పాలనలో భాగం.
తెలంగాణ -ప్రాంతీయ అస్త్తిత్వం
తెలంగాణ ప్రధానంగా ఆదివాసులు, సం చారజాతులు, పశుపోషణ వృత్తిగా స్థిరనివా సం లేని ప్రజలు చర్మకారులు, సేవకులాలు, కులవృత్తుల వారు నివసించే ప్రాంతం. ఈ కారణంగానే ప్రజల దృష్టిలో తెలంగాణ ప్రజాతిరుగుబాట్లకు పేరుగాంచింది, పోరాటాలకు చిహ్నమైంది. ఏదేమైనా సామూహిక ప్రయోజనాలకు మానవ విలువలను పరిరక్షించేం దుకు జరిగిన, జరుగుతున్న చారిత్రక పోరాటాలకు నిలువెత్తు సాక్ష్యం తెలంగాణ. అందుకే ఈ ప్రాంతానికి విశిష్టమైన ప్రాంతీయ అస్తిత్వం ఉంది. ఇక్కడి ప్రజలకు అన్యాయాలపై పోరాడే స్వభావం ఉంది. తెలంగాణ నిమ్నకులాల సామూహిక సంస్కృతికి ప్రతిరూపం.
నియంతృత్వాన్ని సహించని ప్రాంతం నిజాం రాజరిక పాలనలో పాలకుల నియంతృత్వానికి, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఈ ప్రాంతానిది. చీలి దేశ నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత పాబ్లో నెరుడాతో పాటు రష్యన్, స్పానిష్ రచయితలతో గీతాలు రాయించుకున్న ఉద్యమం తెలం గాణ సాయుధ పోరాటం. స్టాలిన్ వంటి వారి మన్ననలందుకోవడంతో పాటు, హరింద్రనాథ్ చటోపాధ్యాయ, చిత్తప్రసాద్ లాంటి జాతీయ కవులను ప్రభావితం చేసిన ఉద్యమం నడిపిన గడ్డ తెలంగాణ.
తదననంతరం 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం, 1971 దశకం లో భూస్వామ్య ఫ్యూడల్ దొరతనానికి వ్యతిరేకంగా వచ్చిన నక్సల్ బరీ ఉద్యమానికి నాయ కత్వాన్ని అందించిన ప్రాంతం ఇది. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా, అలాగే మలిదశ తెలంగా ణ ఉద్యమ ప్రారంభంతో ఆరేండ్ల బాలుడు నుంచి 100 ఏండ్ల వృద్ధుల వరకు తమ అస్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని నిలుపుకొనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కొనసాగించిన ప్రాంతం తెలంగాణ.
తెలంగాణ ఏ ప్రాంతం వారినైనా ఆదుకుంటుంది, అక్కున చేర్చుకుంటుంది. అలాగే ఆకలినైనా సహిస్తుంది కానీ, అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ఏ చర్యను తెలంగాణ సహించదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే ప్రత్యేక తెలంగాణ ఉద్య మం. ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారీ, రాజకీయ, పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన అస్తిత్వ పోరాటమే అది. ‘హైదరాబాద్‌ను మేము అభివృద్ధి చేసినం. అందులో మాకు బాగం ఉంది’ అంటూ మాట్లాడిన ఆంధ్రులను ‘భాగ్యనగరానికి ముగ్గువోసినవా?/ పొలిమేరల బొడ్రాయి పెట్టినవా/ చార్మినార్‌కు సున్నమేసినవ/ గోల్కొండకు రాళ్లు మో సివవా’... అంటూ ప్రజాకవి గూడ అంజయ్య స్పష్టంగా, సూటిగా అడిగిన సందర్భం మనకు తెలుసు.
స్త్రీల చైతన్యానికి ప్రతీక
మధ్యయుగ ఆరంభంలోనే కొనసాగిన కాకతీయ మహా సామ్రాజ్యాన్ని, ఆనాటి పురుషాధిక్యాన్ని ఎదుర్కొని రాజ్యపాలన చేసిన చరిత్ర రాణీ రుద్రమదేవి వంటి వారికి ఉంటే, అంతకు కొంతకాలం ముందే మహా సామ్రాజ్యానికి సైతం ఎదురొడ్డి పోరాడిన చరిత్ర సమ్మక్క-సారక్క వంటి వీరనారిమణులదీ. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, స్వతంత్ర పోరాటంలో జైలును సైతం ముద్దాడిన సంఘం లక్ష్మీబాయి యా దవ్ వంటి వారి తెగువ ఈ ప్రాంతంలో ఆనా టి నుంచే కనిపిస్తుంది.
గంగా-జమున తెహజీబ్
కుతుబ్ షాహీల పాలనలో హిందూ ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో ఒక విశిష్టమైన మిశ్రమ సంస్కృతి ఇక్కడ ఏర్పడింది. తెలంగాణలో దీన్ని గంగా జమున తెహజీబ్ అని నేటికీ పిలుస్తారు. శివరాత్రి నాడు భక్తితో జాగరణ చేసే హిందూ సాంప్రదాయం ము స్లింలను ఆకర్షించి షబేబరాత్, షబే మెహరాజ్ పండుగ సందర్భంగా రాత్రంతా ప్రార్థ నలు చేయడానికి స్ఫూర్తినిచ్చింది.
చరిత్ర గమనంలో తెలంగాణ ప్రాంతం స్వతంత్రానికి ముందు ఒక దేశ హోదా, స్వా తంత్య్రం అనంతరం ఒక రాష్ట్ర హోదా, 1956 తర్వాత ఒక ప్రాంతీయ హోదా తెలంగాణకు ఉంది. 2014లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించుకొని నేడు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ మేటిగా రాణిస్తూ తెలంగాణ ముందుకెళ్తున్నది. ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమికొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతం లోపలే పాతిపెడతాం!’ అని కాళోజీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ మట్టిలోనే ఆ తత్వం ఉందని అర్థం చేసుకోవచ్చు. తమ గుర్తింపు తాపత్రయంలో తెలంగాణకు గుర్తిం పు లేదనే మాట మాట్లాడటం విడ్డూరం. కాబ ట్టి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, ఆ వ్యాఖ్య లు చేసిన బక్క నరసింహులు తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
వ్యాసకర్త: ఓయూ జేఏసీ చైర్మన్, 7893285131






