ఓట్ల కోసం పడరాని పాట్లు
- యాచకుల స్థానాన్ని ఆక్రమించిన నేతలు..
- ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మజీద్ వద్ద నేతల పడిగాపులు
నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్య నేతలు సైతం గడపగడపకూ తిరిగి ఓ టును అభ్యర్థిస్తున్నారు. నిత్యం వార్డుల్లోనే మకాం వేసి ప్రతి ఇంట్లో కలియ తిరుగుతూ మాట మాట కలిపి మంచి చెడులను తెలుసుకుంటున్నారు. ఏనాడూ పలకరించని నేతలు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం, బలమైన హామీలు గు ప్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే సమయం దగ్గర పడుతున్న కొద్ది పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన లీడర్లు ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయా పార్టీ ప్ర ధాన లీడర్లు, పోటీలో ఉన్న అభ్యర్థులు ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జిల్లా కేంద్రంలోని ఆయా మజీద్ ప్రాంగణాల వద్ద పడిగాపులు కాసారు. ప్రతి శుక్రవారం యాచకులు తమ పొట్ట నింపుకోవడం కోసం మజీద్ కేంద్రాల వద్ద యాచిస్తారు. కానీ వారిని పక్కకు తోసి నేతలు బ్యాలెట్ బాక్స్ లో తమ ఓట్లను నింపుకోవడం కోసం నమాజ్ కోసం వచ్చి వెళ్తున్న ముస్లింల నుండి ఓటు యాచిస్తూ కనిపించారు. దీంతో అక్కడే వేచి ఉన్న యాచకులు దీనస్థితిలో కనిపించారు. రద్దీ ప్రాంతాల్లో వ్యాపారాలు చేసే విధంగా తమకంటే తమకు ఓటు వేయాలంటూ ప్రాధేయపడుతూ కనిపించారు. ఇది చూసిన వారంతా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తే సరిపోయేది కదా ఇంతలా కష్టపడాల్సిన పనివచ్చేది కాదేమోనంటూ చర్చించుకున్నారు.






