13 July, 2026 | 5:10 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఎమర్జెన్సీపై స్పీకర్ తొలి ప్రసంగం

27-06-2024 04:50 AM
  • నాటి చీకటి రోజులు గుర్తు చేస్తూ మౌనం పాటింపు

తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు

నిరసన వ్యక్తం చేయడంతో సభ నేటికి వాయిదా

సభాపతి ప్రసంగాన్ని సమర్థించిన ప్రధాని మోదీ, అమిత్ షా

న్యూఢిల్లీ, జూన్ 26: లోక్‌సభ సభాపతిగా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లా సభలో తొలిసారి ప్రసంగిస్తూ వివాదాస్పద ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించారు. జూన్ 25 (మంగళవారం)తో అత్యయిక స్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి విషాదాన్ని గుర్తు చేసుకుంటూ సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఆ సందర్భాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందని బిర్లా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎమర్జెన్సీని ఎదురించిన పోరాడిన వారిని తాము అభినందిస్తున్నామని పేర్కొన్నారు. కానీ, స్పీకర్ ప్రసంగంపై కాంగ్రెస్ సహా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

సభలో దుమారం

తొలుత స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఓం బిర్లాకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని ఓం బిర్లా చదివి వినిపించారు. భారత్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే దేశం. కానీ, 1975 జూన్ 25న మన దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆ రోజు ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక స్థితిని విధించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఖ్యాతి గడించింది.

ప్రజాస్వామ్య విలువలు మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ ఇందిరా నిరంకుశత్వాన్ని అమలు చేశారు. ప్రజాస్వామ్య సూత్రాలు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగదొక్కారు. ప్రతిపక్ష నేతలతో జైళ్లు కిక్కిరిసిపోయాయి. మీడియా గొంతు నొక్కారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దేశమంతా జైలును తలపించింది అని సభాపతి ఓం బిర్లా నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. నాటి చీకటి రోజులకు నివాళిగా సభలో మౌనం పాటిద్దామని సభ్యులను కోరారు. స్పీకర్ ప్రసంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. బిర్లాకు మద్దతుగా అధికార పక్ష నేతలు కూడా నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. 

మోదీ, అమిత్ షా హర్షం... 

ఎమర్జెన్సీపై స్పీకర్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీని సభాపతి ఖండించడం చాలా సంతోషంగా ఉందన్నా రు. అప్పటి ప్రభుత్వం సాగించిన అన్యాయాలను ఆయన ఎత్తిచూపారని తెలిపారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఖండించారు. 49 ఏళ్ల కింద జరిగిన ఘటన ఇప్పుడు అప్రస్తుతమని, అనవసరమని తెలిపారు. ఇలాంటి విషయాలను లేవనెత్తే ముందు సభ్యుల అభిప్రాయం, సహకారం తీసుకోవడం అవసరమని సూచించారు.