13 July, 2026 | 6:23 PM

750 కోట్లతో అయోధ్య మ్యూజియం

27-06-2024 04:43 AM
  • సరయూ ఒడ్డున నిర్మించనున్న టాటా సన్స్

నిర్మాణానికి అనుమతిచ్చిన యూపీ క్యాబినెట్

లక్నో, జూన్ 26: అయోధ్యలో బాలరాముడు కొలువుదీరిన తర్వాత ఆ నగరం దేశంలో ప్రముఖ తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా మారింది. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. అందులో భాగంగా అయోధ్య నగరం శివార్లలో సరయూ నది ఒడ్డున మాఝా జమ్‌తారా వద్ద భారీ మ్యూజియం నిర్మించాలని సంకల్పించింది. సొంత నిధులతో మ్యూజియం నిర్మించేందుకు దేశంలోనే ప్రముఖ సంస్థ టాటా సన్స్ ముందుకొచ్చింది. రూ. 750 కోట్లతో 12 గ్యాలరీలతో ఆయోధ్య రామాలయ మ్యూజియం నిర్మాణానికి యూపీ క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మ్యూజియం నిర్మాణానికి అవసరమైన భూమిని యూపీ ప్రభుత్వం 99 ఏండ్ల లీజుకు రూ.1 రూపాయికే ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రూ.650 కోట్లతో మ్యూజియం వద్ద టాటా సన్స్ మౌలిక వసతులు కల్పిస్తుంది. రూ.100 కోట్లతో మ్యూజియం భవనం నిర్మిస్తారు. 

వాటర్ లీకేజీ అవాస్తవం: నృపేంద్ర 

న్యూఢిల్లీ, జూన్ 26: అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ గర్భగుడిలో లీకేజీ ఏర్పడి వర్షపు నీరు కురుస్తోందని, లీకేజీ నివారణను ఆలయ కమిటీ పట్టించుకోవడం లేదని సోమవారం ఆలయ ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ ఆచార్య చేసిన ఆరోపణలను ఆలయ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తోసిపుచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన అర్చకుడి ఆరోపణలను ఖండిస్తున్నామని ప్రకటించారు. గర్భగుడిలో విద్యుత్ తీగలు అమర్చేందుకు పెట్టిన పైపుల ద్వారా నీరు లీక్ అవుతున్నదన్నారు. గర్భగుడికి వచ్చే భక్తులకు వెలుతురు సోకేలా తాత్కాలికంగా పైకప్పు నిర్మించామని, ప్రస్తుతం మొదటి అంతస్థు నిర్మాణం పూర్తి కావొస్తుందన్నారు.