13 July, 2026 | 4:00 PM

విపక్ష నేతా కీలకమే!

27-06-2024 04:55 AM
  • లోక్‌సభలో విపక్ష నేతకు విస్తృత అధికారాలు

ముఖ్యమైన పోస్టుల భర్తీలో కీలక పాత్ర

అనేక పార్లమెంటరీ కమిటీలో సభ్యత్వం

కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదాతో చాంబర్

గాంధీ కుటుంబం నుంచి మూడో విపక్ష నేత

న్యూఢిల్లీ, జూన్ 26: పదేండ్ల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో 18వ లోక్‌సభలో గతానికి భిన్నమైన వాతావరణ కనిపించే సూచనలు ఉన్నాయి. స్పీకర్ ఎన్నిక రోజే ఆ విషయం తేటతెల్లమైంది. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేత పదవి కూడా పదేండ్ల తర్వాత భర్తీ కావటం, అది కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టడంతో పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఈసారి సభలో 99 మంది ఎంపీల మద్దతు ఉండటం, మరోవైపు ప్రధాని మోదీ తొలిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపాల్సి రావటంతో ముందుముందు సభలో రాహుల్‌గాంధీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నదని రాజకీయ పండితులు చెప్తున్నారు. 

మూడో గాంధీ

దేశ రాజకీయాల్లో గాంధీ కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దేశాన్ని సుదీర్ఘకాలం ఏలింది ఈ కుటుంబమే. ప్రతిపక్ష నేతగా కూడా ముగ్గురు గాంధీలు పనిచేశారు. తొలిసారి 1989 మధ్య మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ లోక్‌సభలో విపక్ష నేతగా పనిచేశారు. అప్పుడు వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నారు. రెండోసారి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999 మధ్య రాజీవ్ సతీమణి సోనియాగాంధీ విపక్ష నేతగా కొనసాగారు. మూడోసారి ఇప్పుడు వారి కుమారుడు రాహుల్‌గాంధీ విపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. 

నియామకాల్లో కీలక పాత్ర

లోక్‌సభలో ప్రతిపక్ష నేత అంటే విపక్షాన్ని ముందుండి నడిపించటం మాత్రమే కాదు. ఆ పదవికి అంతకు మించి అధికారాలు, బాధ్యలు ఉంటాయి. ఈ పదవి కేంద్ర క్యాబినెట్ హోదాకు సమానం. విపక్ష నేతకు ప్రభుత్వ సిబ్బందితోపాటు పార్లమెంటులో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా కేటాయిస్తారు. కొన్ని కీలక నియామకాల్లో ఈ పదవి మరింత కీలకం. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్, నేషనల్ హూమన్‌రైట్స్ కమిషనర్, లోక్‌పాల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తదితర నియామకాల్లో విపక్ష నేత కీలక పాత్ర పోషిస్తారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పలు పార్లమెంటరీ జాయింట్ కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు.