4 March, 2026 | 7:42 PM

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

04-03-2026 04:26 PM

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డెవిడ్

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగులకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డెవిడ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో మహిళా, శిశు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల హక్కుల కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

చేయూత పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద దివ్యాంగులకు త్రాగునీరు, నీడ, ప్రత్యేక మరుగుదొడ్ల వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.సదరం శిబిరాల వద్ద వీల్‌చైర్లు, హెల్పర్లు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం అర్హులైన వారందరికీ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దివ్యాంగుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

దివ్యాంగుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి మండలంలో అధికారులతో సమావేశాలు నిర్వహించి దివ్యాంగుల సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి బాస్కర్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు, విద్య, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, దివ్యాంగుల హక్కుల సమితి సభ్యులు ఇస్లాం బిన్ అహ్మద్, వెంకటేశ్, రవి శంకర్ తదితరులు పాల్గొన్నారు.