కోర్టు ప్రాంగణంలో క్రీడోత్సాహం – న్యాయవాదులు, సిబ్బందికి క్రికెట్ పోటీలు
10-01-2026 05:40 PM
వేములవాడ,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ కోర్టులో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్ల మధ్య స్నేహపూర్వక క్రికెట్ పోటీలను శనివారం నిర్వహించారు. వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు గుడిసె సదానందం సూచనల మేరకు, సాంస్కృతిక క్రీడల కార్యదర్శి గుజ్జే మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
పోటీలకు అజయ్ కుమార్ జాదవ్ టాస్ వేసి శ్రీకారం చుట్టారు. కోర్టు సిబ్బంది–కానిస్టేబుళ్లు ఒక జట్టుగా, న్యాయవాదులు మరో జట్టుగా ఏర్పడి పోటీపడ్డారు. మ్యాచ్‌లు ఉత్సాహంగా సాగగా, సీనియర్ సివిల్ జడ్జి సహా సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఆటను వీక్షించి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం క్రీడాకారులకు సీనియర్ సివిల్ జడ్జి టీ-షర్టులను అందజేశారు.






