క్రీడాల పేరుతో కీచక ఉపాధ్యాయుడు

26-09-2026 | 10:25pm

విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన 

విద్యార్థినుల ఫిర్యాదు.. స్పందించని అధికారులు

విద్యాశాఖ అధికారులపై మండిపడిన తల్లిదండ్రులు.. స్కూల్ ఎదుట ఆందోళన

పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టిన ఎంఈఓ

ఖమ్మం రూరల్‌,(విజయక్రాంతి): పాఠశాలలో పీఈటీ అంటే విద్యార్థులకు ఎంతో గౌరవం.. టీచర్ల కంటే ఎక్కువ క్రీడా పండితుడిని విద్యార్థులు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా తండ్రితో సమానంగా పీఈటీని చూస్తారు. అలాంటి తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉన్న పీఈటీ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులను వేదింపులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడికి పలు మార్లు పీఈటీ పై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం స్కూల్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుదిమల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పీఈటీ వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం ఆందోళన చేపట్టారు. పీఈటీ వేధింపులకు గురిచేస్తున్నారంటూ 16 మంది విద్యార్థినులు సంతకాలతో  ప్రధానోపాధ్యాయుడికి ఇటీవలే ఫిర్యాదు చేశారు.  తమ పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, బాలికలను  వేదింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

విద్యార్థులు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయుడు స్పందించకపోవడంతో శనివారం వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. విద్యార్థులు ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్‌ పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

అనంతరం విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం దృష్టికి తీసుకెళ్లారు. కీచక పీఈటీ పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని డామాండ్ చేశారు. ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. విద్యార్థినుల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు