నేటి నుంచి ఆమనగల్లు జాతర
మూడు రోజులపాటు శ్రీ పార్వతిరామలింగేశ్వర స్వామి ఉత్సవాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
వేములపల్లి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం జాతరకు ముస్తాబయింది. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భద్రకాళి ఊరేగింపు, బోనాలు గణపతి పూజ, చండీ హోమం, ధ్వజారోహణం నిర్వహిస్తారు.
రెండవ రోజు తెల్లవారుజామున పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం, మూడవ రోజు తెల్లవారుజామున అగ్ని గుండాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ తెలిపారు. భక్తులకు, క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. మూడు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆమనగల్లు శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులు, క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశాం. ఆమనగల్లు నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరుతున్నాం.
ఆలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్




