3 August, 2026 | 1:19 PM

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

03-08-2026 12:15 PM

మంథని అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి ఆకస్మిక తనిఖీ

అభివృద్ధి పనులపై స్వయంగా నిఘా.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

మంథని, ఆగస్టు 3(విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం ఉదయం మంథని(Manthani development works) పట్టణంలో ఆకస్మికంగా విస్తృత పర్యటన నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పలు ప్రభుత్వ నిర్మాణాలు, అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

మంత్రి ముందుగా నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం నూతన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని తనిఖీ చేసి, పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మంథని నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ కు సూచించారు. ఈ సందర్భంగా వకీల్ సాబ్ బేగ్ నివాసానికి వెళ్లి ఆయన తండ్రిని పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.

పర్యటన మొత్తం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులతో నేరుగా మాట్లాడడం, నిర్మాణాల పురోగతిపై వివరాలు తెలుసుకోవడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంథని  మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  ప్రసాద్, పిఎసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,  నాయకులు శశిభూషణ్ కాచే, బొబ్బిలి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.