అడ్మిషన్లలోనూ కన్సల్టెన్సీ దందా

10-05-2024 12:57:47 AM

యాజమాన్యాల వద్ద విద్యార్థుల డాటా

రియల్ ఎస్టేట్ మాదిరిగా కాల్‌సెంటర్లు, పీఆర్వోలు

ఎంట్రన్స్ టెస్ట్‌లు పూర్తి కాకముందే అడ్మిషన్లకు ఒత్తిడి

రూ. లక్ష వరకు కమీషన్లు తీసుకుంటున్న మధ్యవర్తులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 9 (విజయక్రాంతి) : మనకు సాధారణంగా రియల్ ఎస్టేట్, లోన్లు, క్రెడిట్ కార్డులకు సంబంధించి కన్సల్టెన్సీ కాల్స్ రావడం సహజమే. కానీ ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, తదితర విద్యాసంస్థలలో అడ్మిషన్ల కోసం కూడా విద్యార్థులు, తల్లిదండ్రులకు కాల్స్ చేస్తున్నారు. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, పీఆర్వోలు నగరంలోని పలు కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను మచ్చిక చేసుకొని, పలుమార్లు ఫోన్లు చేసి తమ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు తీసుకొనేలా ప్రేరేపిస్తునారు. ఇంకా ఎంసెట్ లాంటి పలు ఎంట్రన్స్ టెస్టులు పూర్తి కాకపోయినప్పటికీ అడ్మిషన్లు నిర్వహించడం గమనార్హం. అయితే విద్యార్థుల ఫోన్ నెంబర్లు ఆయా కాలేజీలకు, కన్సల్టెన్సీలు, పీఆర్వోలకు ఎలా చేరుతున్నాయనేది పెద్ద ప్రశ్న? ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, విదేశాల్లో విద్యనభ్యసించడానికి కూడా ఇలాంటి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది. 

నచ్చిన కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తామని

ఇటీవల పదోతరగతి, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. పైచదువుల్లో చేరేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకొని పలు కాలేజీల పీఆర్వోలు, యాజమాన్యాలు, కన్సల్టెన్సీలు క్యాష్ చేసుకుంటున్నాయి. విద్యార్థులకు నచ్చిన కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పిస్తామని వారిని నమ్మిస్తున్నాయి. అడ్మిషన్ ఇప్పించినందుకు పలు కన్సల్టెన్సీలు అటు కాలేజీ యాజమాన్యం నుంచి కమీషన్, ఇటు విద్యార్థుల నుంచి సర్వీస్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ సహా వృత్తివిద్యా కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా అడ్మిషన్లను తాము ఇప్పిస్తామని పలు కన్సల్టెన్సీలు విద్యార్థులకు కాల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రొఫెషనల్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించినందుకు ఏకంగా రూ.50వేల నుంచి లక్ష తీసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా పలువురితో కాల్స్ చేయించి లక్షలు సంపాదించుకుంటున్నారని తెలిసింది. నగరంలోని అమీర్‌పేట్, మియాపూర్, హిమాయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లిలో వివిధ కాలేజీల్లో అడ్మి షన్ల కోసం ఈ కన్సెల్టెన్సీలను నిర్వహిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా పలు కాలేజీలు ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధిం చిన విద్యార్థులకు ఫోన్లు చేసి వెబ్ ఆప్షన్‌లో తమ కాలేజీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరి, వారిని ఆయా కాలేజీల్లో చేర్పించుకుంటున్నారు. అందుకోసం ఆ విద్యార్థులు ఆయా యాజమాన్యాలు రూ.30 ఎదురు చెల్లిస్తున్నాయని తెలిసింది.

విద్యార్థుల వివరాలు వారికెక్కడివి ?

కాల్స్ చేస్తున్న వారికి విద్యార్థుల వివరాలు ఎలా చేరుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యార్థులు చదువుకున్న స్కూల్, కాలేజీల నుంచి వివరాలు చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డేటా సేకరణ కోసం కన్సల్టెన్సీలు, కాలేజీలు, పీఆర్వోలు సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలకు బహుమతులు ఇవ్వడం, విందులను ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇలా వివరాలు సేకరించి విద్యార్థుల తల్లిదండ్రులకు పదేపదే కాల్స్ చేస్తున్నారు. త్వరగా అడ్మిషన్ పొందితే ఫీజులో రాయితీ ఇస్తామని, ఆలస్యమైతే అడ్మిషన్లు దొరకవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మిస్తున్నారు. అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కన్సల్టెన్సీలు కూడా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఈ నయా దందాపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు.

విద్యార్థులు మోసపోవద్దు 

 కన్సల్టెన్సీల పేరిట దందాలకు పాల్పడుతూ విద్యార్థులను మోసం చేస్తున్నారు. రూ.లక్షలు వసూలు చేసి రాత్రికిరాత్రే బోర్డులు తిప్పేస్తున్నారు. వీరిని నమ్మి విద్యార్థులు మోసపోవద్దు. ప్రభుత్వం కన్సల్టెన్సీలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

              -ఆర్‌ఎల్ మూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు

ఎప్‌సెట్‌కు ముందే అడ్మిషన్లు సరికాదు

ఎప్‌సెట్ అయిపోకముందే పలు కాలేజీలు, కన్సల్టెన్సీల నిర్వాహకులు అడ్మిషన్లు చేయడం సరికాదు. ఉన్నత విద్యామండలి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థులను మోసం చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి.

- గ్యార నరేశ్, ఏఐఎస్‌ఎఫ్ హైదరాబాద్ కార్యదర్శి