హోలీ ఎరుగని శ్రీరంగాపురం!
ఊరంతా శ్రీరంగనాథుడి రథోత్సవం
“హోలీ పండుగ అంటేనే అల్లరి, కుటుంబం, బంధువులు, స్నేహితులు ఇలా అందరూ కలిసి రంగులు పూసుకుంటూ సరదాగా జరుపుకునేది. అలాంటి పండుగను దేశం మొత్తం చేసుకున్నా.. ఒక్క గ్రామంలో మాత్రం హోలీ పండుగ అంటేనే తెలియదు. ఎవ్వరూ జరుపుకోరు అంటే నమ్మశక్యంగా అనిపించదు కానీ నమ్మాలి. హోలీ పండుగ రోజే ఆ గ్రామంలో శ్రీరంగనాథుడి రథ సప్తమి (రథోత్సవం) వేడుకలు జరగడం తరతరాలుగా వస్తోంది. దీంతో హోలీ పండుగ కు దూరంగా ఉండడం ఇక్కడి ఆనవాయితీ. అలాంటి గ్రామమే వనపర్తి జిల్లా శ్రీరంగాపురం. ప్రస్తుతం మండల కేంద్రంగా ఉన్న శ్రీరంగాపురంపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..
మారుతున్న ఆధునిక కాలంలో సంప్రదాయాలు మారుతున్నా, ఈ గ్రామం మాత్రం తన ఆచారాన్ని కట్టుదిట్టంగా కాపాడుతోంది. రంగుల పండుగను వదిలి, రథోత్సవాన్ని రంగుల కంటే గొప్పగా భావించిన ఈ గ్రామం నిజంగా ప్రత్యేకమే. భక్తి, పరంపర, ఐక్యత కలిసిన చోటే సంప్రదాయం నిలుస్తుందనే దానికి వనపర్తి జిల్లా శ్రీరంగాపురం గ్రామం (మండల కేంద్రం) ఇందుకు ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది. దేశమంతా రంగుల పండుగైన హోలీలో ప్రజలంతా మునిగి తెలుతుంటే శ్రీరంగాపురంలో ప్రజలు మాత్రం రాజ వంశస్తులు నిర్మించిన శ్రీరంగనాథుడి సేవలో కొలువుదీరుతారు.
హోలీ పండుగ రోజే స్వామి వారి రథ సప్తమి(రథోత్సవం)ని వైభవంగా నిర్వహిస్తారు. తరతరాలుగా హోలీ పండుగ ముఖ్యం కాదు.. రథ సప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ఆ రోజున ఉదయం నుంచే దేవాలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం స్వామివారి రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుతారు. ఈ వేడుకకు రాజవంశస్థులు హాజరు కావడం గ్రామస్థులందరూ కలిసి రథాన్ని లాగడం ఈ ప్రాంత ప్రత్యేకత.
గ్రామ ఐక్యతకు నిదర్శనం
హోలీ రోజు ఎవరూ రంగులు పూయకపోవడం, బయట నుంచి వచ్చిన వారిని కూడా ఆ రోజున రంగులు ఆడనివ్వకపోవడం గ్రామ ఐక్యతను సూచిస్తుంది. యువత కూడా పెద్దల మాటను గౌరవిస్తూ ఈ సంప్రదాయాన్ని కాపాడుతోంది. గ్రామపెద్దల చెబుతున్న ప్రకారం, మా ఊరిలో రంగులు కాదు, రథమే రంగు. స్వామివారి సేవే మా హోలీ పండుగ అంటారు.
రథోత్సవం జరపడంలోనూ ప్రత్యేకత
సాధారణంగా అన్ని ప్రముఖ దేవాలయాల్లో రథోత్సవాన్ని రాత్రి వేళల్లో జరుపుతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ శ్రీరంగాపురంలో ఉదయం వేళ్లలో రథోత్సవాన్ని జరుపడంతో మరో ప్రత్యకతను చాటుకుంటుంది. ఉదయం వేళ్లలో రథోత్సవం జరగడం, రాజవంశస్థుల కుటుంబీకులతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలేకాకుండా చుట్టుపక్కల గ్రామా ల నుంచి తరలివచ్చి, వేడుకలను తిలకిస్తారు. శ్రీరంగనాథుడితో గోదాదేవి వివా హం రోజు, అదేరోజు హోలీ కావడంతో ‘హోలీ పండుగొద్దు.. శ్రీరంగనాథుడిని గోదాదేవి కళ్యాణమే ముద్దు’ అంటూ ఘనంగా రథోత్సవం జరపడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం అని గ్రామస్థులు తెలిపారు.
సినిమా షూటింగ్‌లకు హాట్‌స్పాట్
శ్రీరంగాపురం దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ఎన్నో సినిమాల షూటింగ్ జరిగింది. ఆది, లీలామ హల్ సెంటర్, చెన్నకేశవరెడ్డి, సింహాద్రి, యమదొంగ తదితర సినిమాల్లో కీలక ఘటాలను, పాటలను, ఫైట్లను, సన్నివేశాలను ఇక్కడ తీశారు. ఈ దేవాలయం చుట్టూ(మూడువైపులా) ఒకప్పుడు చెరువు ఉండేది. ఇప్పుడు దానిని రిజర్వాయర్‌గా చేశారు. దీనికి శ్రీరంగాపురం రిజర్వాయర్‌గా పేరు పెట్టారు. ఈ దేవాలయం చుట్టూ మూడువైపులా జలాశయం ఉండడంతో ఎల్లవేళలా ఆహ్లాద వాతావరణం ఉంటోంది. ఇక్కడి నుంచి చూస్తే ద్వీపకల్పంలో ఉన్నామా అనే ఆనందం వెల్లువిరుస్తోంది. వనపర్తి జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వీకెండ్ స్పాట్‌గా కూడా ప్రఖ్యాతిగాంచింది.
పికిలి రాము (వనపర్తి, విజయక్రాంతి)
హోలీ రోజే రథోత్సవం.. ఇదే శ్రీరంగాపురం ప్రత్యేకత
శ్రీరంగాపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీరంగనాథ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు భక్తి వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలిచేది రథోత్సవం. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు పుబ్బ నక్షత్ర యుక్తంగా రథోత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ప్రత్యేకత ఏమిటంటే, దేశమంతటా హోలీ పండుగను జరుపుకునే అదే రోజున శ్రీరంగాపురం గ్రామవాసులు రంగులతో కాకుండా భక్తి రంగులతో మునిగిపోతారు.
గ్రామస్థులందరూ స్వామివారి రథోత్సవానికే ప్రాధాన్యం ఇస్తారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య రంగనాథ స్వామివారిని అలంకరించిన మహా రథంపై ఆసీనులుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. తిరుమాడ వీధుల్లో రథం సంచరించగా భక్తులు ‘గోవిందా గోవిందా’ అంటూ భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుంటారు. మహిళలు మంగళహారతులు పట్టి, పురుషులు రథాన్ని లాగుతూ సేవ చేసే దృశ్యం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. ఇలా హోలీ రోజునే జరిగే రథోత్సవం శ్రీరంగాపురానికి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తోంది. పు విష్ణు నారాయణ, ఆలయ ప్రధాన అర్చకుడు




