పోతిరెడ్డిపాడు గేటు గ్రహపాటు చిక్కుల్లో శ్రీశైలం ప్రాజెక్టు!
- 22 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం
- కొట్టుకుపోయిన పోతిరెడ్డిపాడు 9వ గేటు
- ఇప్పటికిప్పుడు గేటు బిగించడం అసాధ్యం
- రోజుకు 1.9 టీఎంసీల జలాలు కిందకు పరుగులు
- శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ ఖాయం
- ఒక్క రోజులోనే 2.4 టీఎంసీల నీరు మాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందో లేదా తెర వెనుక కుట్ర ఉందో గానీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు(Pothireddypadu Project)లో ఒక గేటు కొట్టుకుపోవడం శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project)కు ప్రమాదం పొంచి ఉంది. గేటు ఊడిపోవడంతో రోజుకు వేల క్యూసెక్కుల నీరు దిగువకు ఉరకలెత్తుతోంది.
దీంతో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో నీటి నిల్వలు అటుంచితే.. శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుందని నీటి పారుదలరంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. గురువారం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ నెంబరు గేటును ఎత్తే సమయంలో గేటుకు ఉన్న రోప్ తెగిపోయింది. గేటు బకెట్ కూడా నీటిలో కొట్టుకుపోయింది. దీంతో కృష్ణా నది నీళ్లు ధారాళంగా కిందకు పరుగులెత్తుతున్నాయి.
22 వేల క్యూసెక్కుల ప్రవాహం..
నిజానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 11 గేట్లు 841 ఫీట్ల ఎత్తున (సముద్రమట్టానికి) బిగించారు. అంటే 841 ఫీట్ల మట్టం.. ఆ గేట్లకు క్రస్ట్ లెవల్/సిల్ లెవల్‌గా పేర్కొంటారు. ఒక్కో గేటును 10x8.57 మీటర్ల ఎత్తు, వెడల్పుతో నిర్మించారు. ఈ నిర్దేశిత ఎత్తు, వెడల్పుతో నిర్మించిన గేటు మొత్తం కొట్టుకుపోవడంతో ఆ గేటు నుంచి మొత్తంగా 22వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం బయటకు వెళుతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 1.90 టీఎంసీలు మాయం
గురువారం గేటు కొట్టుకుపోయే సమయంలో శ్రీశైలం రిజర్వాయర్‌లో సుమారు 865.7 ఫీట్ల నీటిమట్టం ఉంది. అంటే సుమారు 127 టీఎంసీల నీటి పరిమాణం శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. శుక్రవారం నాటికి ఈ నీటి మట్టం కాస్తా 865.6 ఫీట్లకు చేరుకుంది. అప్పుడు 124.6 టీఎంసీల నీటి పరిమాణం ఉందని ప్రభుత్వం వెబ్‌సైట్లలోనూ గణాంకాలు పొందుపర్చారు. అంటే ఒక్క రోజులోనే సుమారు 2.4 టీఎంసీల నీటి పరిమాణం శ్రీశైలం నుంచి మాయం అయ్యిందనేది స్పష్టం అవుతోంది.
దీనితోపాటు.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పడిపోయిన 9వ నెంబరు గేటు నుంచి వెళ్ళిపోతున్న 22 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకున్నా వాస్తవం బయటపడుతుంది. 24 గంటల పాటు (ఒక రోజు ) 22 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే.. అది 1.90 టీఎంసీలుగా చెప్పవచ్చు. ఈ లెక్కన చూసుకున్నా.. పోతిరెడ్డిపాడు నుంచి ప్రతిరోజూ 1.9 టీఎంసీల చొప్పున నీరు తరలిపోవడం ఖాయమని తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో నమోదైన శ్రీశైలం నీటి మట్టం, నిల్వను పరిశీలిస్తే ఇది నిజమనేది అర్థమవుతుంది.
గురువారం 127 టీఎంసీలు ఉన్న నీటి పరమాణం కాస్తా.. శుక్రవారానికల్లా 124.6 టీఎంసీలకు చేరింది. ఇందులో పోతిరెడ్డిపాడు నుంచి సుమారు 1.90 టీఎంసీలు, అలాగే ఇరు వైపులా జరుగుతున్న జల విద్యుత్తుతో.. మరో 0.5 టీఎంసీల నీరు నాగార్జునసాగర్ వైపు విడుదలయ్యిందని చెప్పవచ్చు. మొత్తంగా ఒక్క రోజులోనే 2.4 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి మాయం అయ్యింది. ఇందులో పోతిరెడ్డిపాడు నుంచే 1.9 టీఎంసీలు కావడం గమనార్హం.
ఇప్పట్లో గేటు బిగించే అవకాశం లేనట్టే..
సాగునీటి రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొట్టుకుపోయిన పోతిరెడ్డిపాడు గేటును ఇప్పట్లో బిగించే అవకాశం లేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం శ్రీశైలంలో 865.6 ఫీట్ల నీటి మట్టం ఉంది. పోతిరెడ్డిపాడు గేటు సిల్ట్ లెవల్ 841 ఫీట్లు. అంటే గేట్లు ఎంత ఎత్తు వరకు ఉంటే అంత ఎత్తువరకు నీటి ప్రవాహం పోతూనే ఉంటుంది. గేటు బిగించాలంటే.. 841 ఫీట్ల స్థాయికి నీటి మట్టం చేరుకోవాలి.
పైగా తాజాగా ఆంధ్రప్రదేశ్ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును నీటితో నింపాలనే ఆలోచనలో ఏపీ ఉందనుకుంటున్నారు. ప్రమాదవశాత్తో... కుట్రపూరితంగానో.. ఇప్పుడు గేటు కొట్టుకు పోవడం వారికి కలిసివచ్చిందని.. తెలంగాణకు చెందిన పలువురు నీటిపారుదల ఇంజనీర్లుకూడా అభిప్రాయపడుతున్నారు.
శ్రీశైలం ఖాళీ కావడం ఖాయం..
కొట్టుకుపోయిన పోతిరెడ్డిపాడు గేటును ఇప్పట్లో బిగించే అవకాశం లేకపోవడంతో.. 22 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం నిరంతరాయంగా వెళుతూనే ఉంటుంది. ప్రస్తుతం 865.6 ఫీట్ల నీటి మట్టం ఉంది. ఇప్పుడు 124.6 టీఎంసీల నీటి పరిమాణం ఉంది. ఇది 841 ఫీట్ల ఎత్తుకు దిగజారిపోతే.. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌లో మిగిలేది.. 98.64 టీఎంసీల జలాలు మాత్రమే మిగులుతాయి. అంటే సుమారు 25 టీఎంసీల నీటిని ఏపీ ఒడిసిపట్టుకునే అవకాశం కనపడుతోంది.