అశ్వశాల నిర్వహణ

09-09-2026 | 05:10am

పాలకుర్తి రామమూర్తి :

యుద్ధవ్యాధిజరాకర్మక్షీణాః 

పిండగోచరికాః స్యుః

అసమర ప్రయోగ్యాః 

పౌరజనపదానామర్థేన

వృషా వడవాస్వాయోజ్యాః!

(కౌటిలీయం- 2-30ఏ)

ప్రాచీనకాలం(Ancient times)లో యుద్ధాలలోనూ, రవాణావ్యవస్థ(Transportation system)లోనూ గుర్రాలను అధికంగా ఉపయోగించేవారు. గుర్రాల రక్షణకు ఆశ్వశాల ఏర్పాటు ఆవశ్యకతను చెప్పడమే కాక అశ్వశాల నిర్వహణకు సంబంధించిన పలు సూక్ష్మాంశాలను తమ అర్థశాస్త్రం(Economics)లో చర్చించారు, ఆచార్య చాణక్య(Acharya Chanakya). గుర్రాలలో జాతులను గుర్తించి వివరించడం, వాటికి ఇవ్వవలసిన ఆహారాదులను, శిక్షణ గురించి సవివరంగా రెండవ అధికరణంలో పొందుపరచారు.

శారీరకంగా బలంగా ఉండడం, ఆదేశాలకు స్పందించడం... శిక్షణపొందిన గుర్రాల లక్షణంగా పేర్కొంటారు. అశ్వశాల నిర్వహణా వ్యవస్థను కేవలం గుర్రాల జాతుల వర్ణన, వర్గీకరణ లాంటి వాటికే పరిమితం చేయకుండా, ప్రాచీన భారతదేశంలో సైనిక, పశుసంవర్ధనం, జంతు సంక్షేమం, సైనిక అవసరాల నిర్వహణ, పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన  సమగ్ర రూపానికి ప్రతీకగా చూడవచ్చు.

యుద్ధంలో ఉపయోగించేందుకు కాంభోజ (కాబూల్), సింధు, ఆరట్ట, వనాయు (అరబ్) దేశాలలో జన్మించిన అశ్వాలు ఉత్తమమైనవిగా గుర్తించారు. బాహ్లిక (బియాస్, సతలజ్ నదుల మధ్యదేశం) పాపేయ (పశ్చిమ ఉత్తర సీమాప్రాంతం), సౌవీర (రాజస్థాన్) తైతల దేశాలలో పుట్టినవి మధ్యమమైనవి. కాగా మిగిలిన దేశాలలో జన్మించిన గుర్రాలను అధమజాతివిగా గుర్తించారు.

అలాగే ఆ గుర్రాలలో అత్యధిక తేజస్సు, సత్తువ (బలం) కలిగినవి ‘తీక్ష్ణాశ్వమని’, మంచి తేజస్సు బలం కలిగినది ‘భద్రాశ్వమని’, సత్తువ తక్కువగా ఉన్న గుర్రాలు మందాశ్వాలని వర్గీకరించారాయన. అయా గుర్రాల స్వభావాన్ని అనుసరించి యుద్ధరంగంలో వాటితో పనిచేయించుకోవాలి. అలాగని ఒక గుర్రం యుద్ధంలో ఉపయుక్తం కానంత మాత్రాన అది పూర్తిగా పనికిరాదని భావించలేదు. యుద్ధరంగానికి పనికిరాని గుర్రాలను క్రీడలకు, బండ్లు, రథాలు లాగేందుకు ఉపయోగించారు. దీనిని వనరుల సామర్థ్య వినియోగమనే ఆధునిక పరిపాలనా భావనకు సారూప్యతగా భావించవచ్చు. 

వల్గనం (వేగంగా పరుగెత్తడం), నీచైర్గతం (నెమ్మదిగా నడవడం), లంఘనం (దుముకడం లేదా దాటడం), ధోరణం (ఎగురుతూ నడిచేది లేదా స్వారీచేయదగినది), నారోష్ట్రం (రౌతు చెప్పినట్టుగా నడిచేది, గుర్తులను బట్టి గుర్తించేది).. వీటిని క్రీడలకు, బండ్లు రథాలు లాగేందుకు ఉపయోగించే గుర్రాల గతులుగా చెప్పారు. గుర్రం కదలికా సామర్థ్యం, ఆజ్ఞానుసరణ అనే రెండు వేరువేరు పనితీరులు ప్రమాణాలుగా వాటి గతులను గుర్తించడంగా దీనిని భావించాలి.

యుద్ధంలో దెబ్బలు తిన్నవాటినీ, వ్యాధులతో పీడింపబడే వాటిని, ముసలితనంతో లేదా కొంతకాలంగా శ్రమించి క్షీణించి ప్రస్తుతం పనిచేయలేని స్థితిలో ఉన్నవాటిని, గుర్తించి వాటికి తగిన ఆహారాన్ని అందించాలి.  యుద్ధాలలో ఉపయోగించలేని గుర్రాలలో ఉత్తమమైన గుర్రాలను పౌరులకు జానపదులకు అవసరనుగుణంగా ఇవ్వాలి. అలాగే వాటిని వృషాశ్వాలుగా అంటే ఆడగుర్రాలతో కలవడానికి వినియోగించాలి, అంటారు చాణక్య.

అశ్వశాల నిర్వాహకుడు గుర్రాలను వాటి సామర్థ్యాన్ని బట్టి వినియోగంలోకి తీసుకురావాలి. రథాన్నిలాగే ఉత్తమాశ్వాలలో ఉత్తమమైనవి రోజుకు పన్నెండు యోజనాలు ప్రయా ణం చేస్తాయి.. మధ్యమరకాలు తొమ్మిది యోజనాలు ప్రయాణించగలవు.. అధమరకం ఆరు యోజనాలు ప్రయాణం చేస్తాయని వర్గీకరించారు. యోజనం అంటే సుమారుగా ఎనిమిది మైళ్లు. అలాగే రౌతు స్వారిచేసే గుర్రాలు లేదా సామాను మోసే గుర్రాలలో ఉత్తమమైనవి రోజుకు పది యోజనా లు, మధ్యమమైనవి ఏడున్నర యోజనాలు, అధమమైనవి అయిదు యోజనాలు ప్రయా ణం చేస్తాయి.

వీటిలో వేగంగా నడిచే గుర్రాలను భారవాహ్యమని, ఆయాసపడకుండా మధ్యరకంగా వేగంగా నడిచే గుర్రాలను భద్రాశ్వామని, మెల్లగా నడిచే గుర్రాలను విక్రమమని చెపుతారు. వీటి గతులను గుర్తించి వర్గీకరించి వాటిని ఆయా పనులలో ఉపయోగించాలని చాణక్యుని సూచన. గుర్రం ఎంత దూరం ప్రయాణించగలదో ముందుగానే అంచనా వేసి, దాని ఆధారంగా సైనిక ప్రయాణాలను ప్రణాళిక చేయడమనేది ఇందులో గమనించాల్సిన అంశం.

అన్ని అశ్వాలకూ గ్రీష్మ శరత్కాలాలలో రోజుకు రెండుమార్లు స్నానాలు చేయించాలి. అలాగే యుద్ధయాత్ర ప్రారంభంలోనూ, యుద్ధం నుంచి వచ్చాకా వాటికి నీరాజనాలు ఇప్పించాలని చెపుతారాయన. ఆనాటి విజయోత్సవ నిర్వహణలో అదొక భాగం. దీనిని మతపరమైన ఆచారంగా మాత్రమే చూడకుండా సైనిక వ్యవస్థలో గుర్రాలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవంగా భావించవచ్చు. ఇది యుద్ధానంతరం వాటి ఆరోగ్య సంరక్షణకు ప్రాతిపదికగా కూడా నిలుస్తుంది. దీనిని గుర్రాల నిర్వహణలో శుభ్రత, సంరక్షణ, ప్రాంతీయాచారం అనే మూడు కోణాలలో చూడవచ్చు.

సంక్షిప్తంగా దీనిని పరిశీలిస్తే గుర్రాలను జాతి ఆధారంగా ఎంపిక చేయడమనేది వనరుల నాణ్యతను అంచనా వేయడంగానూ, వాటి తేజస్సు, సత్తువను పరీక్షించడం సామర్థ్య మూల్యాంకనగానూ, వాటి గతుల పరిశీలనను గుర్రాల పనితీరుకు పరీక్షగానూ భావించవచ్చు. దూర ప్రయాణ ప్రమాణాలను నిర్ధారించడం వాటి పనితీరు ప్రమాణాలను అంచనా వేయడంగానూ, అనారోగ్య గుర్రాలను వేరు చేయడం గుర్రాల ఆరోగ్య నిర్వహణ పట్ల వ్యవస్థీకృత శ్రద్ధకు దర్పణంగా చూడవచ్చు.

దీనిని ఆధునిక జంతు సంక్షేమ భావనతో పోల్చవచ్చు కూడా. అలాగే యుద్ధానికి పనికిరాని గుర్రాలను ఇతర పనులకు వినియోగించడం అనేది వనరుల పునర్వినియోగంగానూ, యుద్ధాలలో పనికిరాని వాటిని సంతానోత్పత్తికి ఎంపికచేయడమనేది జన్యు లేదా జాతి పరిరక్షణగానూ భావించవచ్చు. గుర్రాలకు స్నానం చేయించడం, సంరక్షణ చేయడమనేది జంతు సంక్షేమంగా కూడా భావించవచ్చు.

చాణక్యుని దృష్టిలో అశ్వశాల ఒక సైనిక నిర్వహణాకేంద్రం. ఆ కేంద్రంలో గుర్రాల ఎంపిక, వర్గీకరణ, అవసరమైన శిక్షణ, కార్యక్షేత్రంలో వినియోగించడం, ఆహారాన్ని అందించడం, ఆరోగ్య సంరక్షణ, యుద్ధసంసిద్ధత తిరిగి యుద్ధానంతర వినియోగం, సంతానోత్పత్తి లాంటివన్నీ నిబద్ధతతో నిర్వహింపబడేవి.  

చివరగా ఒక్కమాట... చాణక్య సూచించిన అశ్వశాల నిర్వహణను ఆధునికంగా గుర్రాలను పెంచడం, పోషించడం ఆయా కార్యాలకు వినియోగించడానికి ఉపయోగించే శాస్త్రీయ విధానాన్ని ఆనాటి విధానంతో యథాతథంగా పోల్చకూడదు. ఉత్తమ, మధ్యమ, అధమమనే వర్గీకరణ ఆనాటి సైనిక అవసరాలు, ప్రాంతీయ గుర్రాలపై ఉన్న అభిప్రాయాల నేపథ్యంలో నిపుణులు వారివారి అనుభవాలు ప్రాతిపదికగా చేసిన విభజన మాత్రమే. అవి సార్వకాలికం కాజాలవు.

అయినప్పటికీ గుర్రం జాతి, శారీరక సామర్థ్యం, స్వభావం, శిక్షణ, ఆరోగ్యం, వయస్సు, దాని పనితీరు పరిగణించి దానికి తగిన పనిని అప్పగించాలనే చాణక్యుని సూచన ఆదరణీయమైనది. ఆనాడు సూచించిన అశ్వశాలను ఈనాటి వాహనశాలలకు అన్వయించుకుంటే... సైనిక అవసరాలను బట్టి వాహనాల ఎంపిక, వాటి నిర్వహణ, సంరక్షణ, వినియోగం, కాలం చెల్లిన వాటిని మరొకచోట వినియోగించడం లాంటి ప్రక్రియలకు ఆధారభూతమైన కార్యక్షేత్రంగా, సమగ్ర పరిపాలనా వ్యవస్థగా భావించవచ్చు.

మరిన్ని వార్తలు