అదే తీరు.. అమ్మకాల జోరు
న్యూఢిల్లీ, మే 30: లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్, వాస్తవ ఫలితాలు వెల్లడయ్యే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వారివ ద్దనున్న షేర్లను తెగనమ్ముతున్నారు. అమ్మకాల తీవ్రత పెరగడంతో వరుసగా ఐదో రోజూ స్టాక్ సూచీలు పతనబాట పట్టాయి. గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో 613 పాయింట్ల క్షీణించి 74,000 స్థాయి దిగువకు జారిపోయి 73,885 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం నమోదుచేసిన 76,009 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి ఇప్పటివరకూ 2,100 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఇదేబాటలో తాజాగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మరో 216 పాయింట్లు క్షీణించి 22,500 దిగువన 22,488 పాయింట్ల వద్ద నిలిచింది.
ఈ ఇండెక్స్ వరుస ఐదు సెషన్లలో 479 పాయింట్లు కోల్పోయింది. 23,110 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి 600 పాయింట్లకుపైగా నష్టపోయింది. రెండు సూచీలు గ్యాప్‌డౌన్‌తోనే మొదలై రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్‌లు నష్టపోగా, షాంఘై లాభపడింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలు సైతం మార్కెట్ తాజా నష్టాల కారణమయ్యాయి. యూఎస్ ద్రవ్యోల్బణం గణాంకాలు శుక్రవారం వెల్లడికానున్న నేపథ్యంలో అమెరికా స్టాక్ ఫ్యూచర్లు భారీగా తగ్గాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి.
బుల్ ఆఫ్‌లోడింగ్
మే నెల డెరివేటివ్ కాంట్రాక్టులకు గురువారం ముగింపు రోజైనందున, బుల్స్ వారి లాంగ్ పొజిషన్లను పెద్ద ఎత్తున ఆఫ్‌లోడ్ చేసుకున్నారని ట్రేడర్లు తెలిపారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నందున జూన్ నెలకు లాంగ్ పొజిషన్ల రోలోవర్స్ అంతంతమాత్రంగా జరగడం, షార్ట్ పొజిషన్లు క్యారీకావడమూ మార్కెట్‌ను దెబ్బతీసిందని వారు వివరించారు. యూఎస్ ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతల్లో జాప్యం జరుగుతుందన్న భయాలతో ప్రపంచ మార్కెట్లు తగ్గాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ వారాంతంలో (జూన్ 1) ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో డెరివేటివ్ కాంట్రాక్టుల మంథ్లీ ఎక్స్‌పైరీ క్లోజింగ్ సందర్భంగా స్వల్పకాలిక పొజిషన్లను హోల్డ్ చేసే ఆసక్తిలేకపోవడంతో ట్రెండ్ బలహీనపడిందని నాయర్ వివరించారు.
మరో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరి
తాజా మార్కెట్ క్షీణత ఫలితంగా మరో రూ.3.03 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మే 27న ట్రేడింగ్ ప్రారంభం లో నమోదైన 76,009 పాయింట్ల రికార్డు గరిష్ఠం నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్ 2,100 పాయింట్లకుపైగా పతనమయ్యింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ క్రితం రోజుతో పోలిస్తే రూ.3.03 లక్షల కోట్ల మేర తగ్గి రూ.412 లక్షల కోట్లకు కోట్లకు పడిపోయింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8 లక్షల కోట్ల సంపదను ఇన్వెస్టర్లు నష్టపోయారు.






