కోమటిరెడ్డి సోదరుడి షోరూమ్‌పై రాళ్ల దాడి
-బంద్ పాటించలేదని బీజేపీ నేతల ఆగ్రహం
-నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత
నల్లగొండ క్రైమ్, అక్టోబర్ 18: బీసీ బంద్ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతకు దారితీసింది. నల్లగొండ బైపాస్ రోడ్డులో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడికి సంబంధించిన పవన్ మెటార్స్ నెక్సా కార్ల షోరూమ్ బంద్ చేయలేదు. దీంతో స్థానిక బీజేపీ బీసీ నాయకులు షోరూమ్ బంద్ పాటించనందుకు ఆగ్రహించి రాళ్ల దాడి చేశారు. షోరూమ్ నిర్వాహకులు మాత్రం బంద్ పాటించామని చెపుతున్నా వినకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి షోరూమ్ కావడం వల్లే గ్లాస్‌పై రాళ్ల దాడి చేశారని షోరూమ్ హెఆర్ సుధాకర్ నల్లగొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలాన్ని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, రూరల్ ఎస్‌ఐ సైదాబాబు పరిశీలించారు.
అమరచింతలో జెండాల లొల్లి
వనపర్తి (విజయక్రాంతి): వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో పార్టీ జెండాల లొల్లి శనివారం చోటు చేసుకుంది. బీసీ బంద్‌లో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత మండలం కేంద్రంలో ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం వామపక్ష పార్టీల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. బీఆర్‌ఎస్ జెండాలు ఎక్కువగా ఉన్నాయని, తమ జెండాలు కనపడటం లేదని, వాటిని తొలగించాలని, వామపక్ష, కాంగ్రెస్ నాయకులు వాదనకు దిగారు.
జెండాలను తొలగించే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ నాయకులు వాదించడంతో ఇరు వర్గాల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీపీఎం, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. బీజేపీకి బీఆర్‌ఎస్ తొత్తుగా వ్యవహరిస్తూనే బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపడం వెనుక కుట్ర ఉన్నదని సీపీఎం నాయకులు విమర్శించారు. తమ పార్టీ ఏ పార్టీకి కొమ్ముకాయడం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ముందు నుంచి బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి శాంతింపజేశారు.
తెరిచి ఉన్న హోటళ్లపై సీపీఐ దాడి
కరీంనగర్‌లో తెరిచి ఉంచిన పలు హోటళ్లపై సీపీఐ నాయకులు దాడి చేశారు. ప్రతిమ హోటల్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. బంద్‌కు సహకరించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. తెలంగాణ చౌక్‌లో అధికార కాంగ్రెస్ నేతలతోపాటు సీపీఐ, బీఆర్‌ఎస్, బీజేపీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, బీసీ సంఘాల నాయకులు బంద్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల ఉద్రిక్తలు
హైదరాబాద్‌లోని నల్లకుంట పరిధిలో బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్‌ను బేఖాతరు చేయకుండా తెరిచి ఉన్న బజాజ్ షో రూంతో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై ఆందోళనకారులు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ విసిరారు. దీంతో షోరూం అద్దాలు ధ్వంసమై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదేవిధంగా తెరిచి ఉంచిన పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోట్రోల్ కొట్టే ఫ్యూయల్ మెషిన్లను వారు ధ్వంసం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.




