19-10-2025 12:38:18 AM
సాత వాహనుల పేర్లలో పేరు చివర వంశం పేరుంటుంది. మొదట సిరిసాత వాహన, తర్వాత చిముక సాతవాహన వారి పేర్లలోని సాత వాహన మళ్లీ ఎవరి పేరుతో కనిపించదు. తర్వాత అందరి పేర్ల చివర సాతకర్ణి అనే ఉప నామమే వుంటుంది. ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు ఎవరి పేర్లతో కూడా వంశ నామమేది కనిపించదు. మళ్లీ కాకతీయుల నుంచే శాసనాల్లో వంశ నామంతో కాకతీయ పాలకుల పేర్లు కనిపిస్తాయి.
తొలి కాకతీయులైన గుండయ, ఎరియ పేర్లతోనే రాష్ట్రకూట నామం కనిపిస్తుంది. అది వంశ నామం కాదు. వారు పని చేస్తున్న రాజరికపు వంశం పేరు. మాంగల్లు శాసనంలో ఒక్కసారి కనిపించే ఈ ఉపనామాన్ని బట్టి కాకతీయుల్ని రాష్ట్రకూటులు అనడం సముచితం కాదు. చరిత్రలో ఈ పేర్లను రాసే పద్ధతిని, మర్యాదల్ని గమనంలోనికి తీసుకోవాలి.
ఎందుకో కాకతీయుల మీద చరిత్రకారులు, ప్రజలు అన్నీ రాజ వంశాల మీద కన్నా ఎక్కువ ప్రేమాతిశయాన్ని చూపిస్తున్నారు. వారి కులం, వంశం తేల్చడానికి ఆధారాలు శాసనాలే. కాకతీయుల వంశం గురించి వారిది కాకర్త్య అని మాంగల్లు (గుండన, 956) శాసనం, సామంతవిష్టి అని 2వ బేత (1090) కాజీపేట దర్గా శాసనం, దుర్జయ అని 2వ బేత హన్మకొండ (?) శాసనం, మైలాంబ (గణపతిదేవ) బయ్యారం (?) శాసనం, 1వ ప్రోల నుంచి ప్రతాపరుధ్రుని దాకా 400 వందల శాసనాలు కాకతీయ అని పేర్కొంటున్నాయి.
విష్టి వంశం పేరు కాదు.. అధికార పదవి
ప్రతాపరుధ్రుని శాసనాలన్నిట (క్రీ.శ.1323వరకు) కాకతీయ అనే వంశనామమే వుంది. మరొకమాట రాలేదు. ఈ శాసనాల ఆధారంగా వారిది కాకతీయ వంశం అన్నది నిర్వివాదాంశం. సామంత విష్టి అన్నది ఒక ప్రభుత్వ అధికారం. గతంలో విష్టి పేరుతో పిలువబడ్డ రాష్ట్రకూటులున్నారు. పశ్చిమ చాళుక్యులు, వేములవాడ చాళుక్యుల కాలంలో ప్రభుత్వ అధికారులున్నట్లు శాసనాధారాలు లభిస్తున్నాయి. విష్టి అన్నది వంశం పేరు కాదు. అధికార పదవి.
దుర్జయుడు.. ఊహా పురుషుడు
దుర్జయుడనే పురాణ పురుషుడు భాగవత పురాణాన్ని బట్టి మాంధాత కుడి తొడ నుంచి పుట్టిన వాడు. దుర్జయుడు తీరాంధ్ర ప్రాంతాల పాలకులు అందరికీ వంశ కర్తగా చెప్పుకున్న శాసనాలెన్నో వున్నాయి. 2వ బేతరాజుకు శైవ దీక్షనిచ్చిన గురువులు రాసిన శాసనంలో ‘దుర్జయ’ నామం వచ్చింది. రెండవ సారి మైలమ గురువు ధర్మశంభు రాయించిన బయ్యారం శాసనంలో మళ్లీ ‘దుర్జయ’ నామం కనిపించింది. మధ్యలో ఎవరి శాసనాల్లోనూ దుర్జయ వంశం అని చెప్పుకున్న దాఖలాలు లేవు. దుర్జయుని పేరు కాకతీయులకున్న ప్రశస్తుల్లో అతిశయంగా చెప్ప బడ్డదే తప్ప నిజం కాదనిపిస్తున్నది. దుర్జయుడు ఊహా పురుషుడు.
కొత్తాకిరియా ఉత్పన్న పదం కాకతి
కాకతీయ అన్నది కాకర్త్య నుంచి వచ్చిందన్నది దాదాపుగా అందరు చరిత్రకారులు అంగీకరించిన మాట. కాకర్త్య, కాకిరిత, కాకిత, కాకతి ఈ పరిణామ పదాలు జైనయక్షిణి, శాసనదేవత ఆమ్రకూష్మాండిని, అంబికకు ఉన్న పర్యాయ పదాల్లో ఒకటైన కొత్తాకిరియా నుంచి ఉత్పన్నమైనవి.
జైన రూప మండన అనే జైన ప్రతిమా లక్షణ శాస్త్రంలో పేర్కొన్న జైనగ్రంథాల ఆధారంగా కొత్తాకిరియా నుంచి ఉత్పన్న పదం కాకతి అని విశ్వసిస్తున్నాను. కొత్తాకిరియా అంటే గిరిజన యోధురాలనే మరొక అర్థం కూడా వుంది.
ఆమ్రకూష్మాండినే కాకతి దేవత
జైనంలో యక్షిణులను ఆరాధించే శాక్తేయ తంత్రాలున్నాయని జైన మత విశ్లేషకులు అంగీకరించినదే. అటు వంటిదే ఆమ్రకూష్మాండిని ఆరాధన. బొమ్మలగుట్ట, కుర్క్యాల శాసనంలో పేర్కొన్న చక్రేశ్వరి కూడా జైన శాసన దేవతే. ఆమెనే యక్షేశ్వరి అని కూడా పిలుస్తారు. కొన్ని కైఫీయతులలో కాకతీయులకు, పొలవాస రాజులకు మూల పురుషుడుగా చెప్పబడ్డ మాధవ వర్మ యక్షేశ్వరి భక్తుడు.
ఆమ్రకూష్మాండిని వున్న జైన బసది ఇప్పటి పద్మాక్షి గుడి వద్ద వున్న నీటి కుండాన్ని ఆమ్రకుండమని, ఆమ్మకూష్మాండిని గుడి వున్న చోట వెలసిన గ్రామాన్ని ఆమ్రకుండ అని పిలిచేవారని చెప్ప వచ్చు. ఆ పేరే రాష్ట్రకూట రాజ ప్రతినిధి శంకరగండరస వేయించిన వేల్పుగొండ శాసనం (888), కొండపర్తి (900), కాజీపేట శాసనాల్లో హనుమకొండ అర్మకుండ, అరియకుండ, అన్మకుండగా పేర్కొనబడ్డది.
కాకతీయుల శాసనాల్లో అదే అమ్మకొండ, అనుమకొండ, అన్మకొండగా వందల శాసనాల్లో పేర్కొన బడ్డది. అందువల్ల ఆమ్రకూష్మాండినే కాకతి దేవతని, ఆ దేవత వెలసిన నగరమే కాకతి పురమని చెప్పాలి. కాకతీయుల్ని బయటి వాళ్లని వేరే రాష్ట్రాల దిక్కు, వేరే దేశాల వైపు చూపించాల్సిన అగత్యం లేదు.
రుద్రమదేవి 29ఏళ్లు రాణిగా..
కాకతీయులు అందరిని అ(ర్మ)మ్మకుండ, అన్మకుండ, అనుమకొండ పురవరేశ్వరులని, రుద్రదేవుడు, గణపతిదేవుని శాసనాల్లో చెరొకసారి మాత్రమే కాకతీయ పురవరేశ్వరులని పేర్కొన్నాయి శాసనాలు. క్రీ.శ.1246 నుంచి కాకతీయుల రాజధానిగా ఓరుగల్లు పేర్కొనబడ్డది. కాని, శాసనాల్లో అన్ని సార్లు కాకతీయ ప్రభువులను అనుమకొండపురవరేశ్వరులని ఎప్పటి లెక్కనే పేర్కొంటు వచ్చారు. అంటే కాకతి అనే పట్టణం మరొక చోట లేదనే దీని అర్థం. అనుమకొండే కాకతి పురం.
క్రీ.శ.1261నాటి త్రిపురాంతక శాసనం అది రుద్రమదేవి 2వ రాజ్య సంవత్సరంగా పేర్కొన్నది. అంటే రుద్రమదేవి 1260 నుంచే రాజ్యాధికారం చేపట్టినట్లు తెలుస్తున్నది. శాసనాధారంగా రుద్రమదేవి 1260 నుంచి 1289 వరకు అంటే 29సం.రాలు రాణిగా వున్నదని చెప్పొచ్చు. గణపతిదేవుని పేర్కొనే శాసనాలు మాత్రం క్రీ.శ.1264దాకా లభిస్తున్నాయి. ప్రతాపరుద్రుని శాసనాలు 1290 ఫిబ్రవరి 25నుంచి లభించాయి.ౠ1323లో మరణించిన ప్రతాపరుద్రుని పేరుమీద 1326 దాక శాసనాలు రావడం విశేషమే.