వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతికి భారత్ తనవంతు సాయం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ
భారత్ మండపంలో 45 నిమిషాల పాటు ఇరు దేశాధినేతల భేటీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య కూడా దృఢంగా నిలబడిన రష్యా-భారత్(Russia-India) తమ ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసు కోవడానికి అంగీకారం కుదిరిందని ప్రధాని మోదీ(Prime Minister Modi) తెలిపారు. పశ్చిమ ఆసియా(West Asia) సంఘర్షణ నేపథ్యంలో భారత నావికుల భద్రత అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో ప్రస్తావించారు. అలాగే ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలకు సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన 18వ బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్(BRICS Business Forum) సమావేశం సందర్భంగా పుతిన్, మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారత్ మండపంలో దాదాపు 45 నిమిషాల పాటు ఇరుదేశాధినేతలు రక్షణ, ఇంధనం, వాణిజ్యంపై చర్చించారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా వెలుపల జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ ప్రత్యక్షంగా పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మోదీ, పుతిన్‌ల మధ్య జరిగిన రెండో సమావేశం కూడా ఇదే కావడం గమనార్హం.
ప్రధాని మోదీ, పుతిన్ రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభి వృద్ధి, ప్రజల మధ్య సంబంధాల రంగాలలో భారత్-రష్యా సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. పశ్చిమ ఆసియా, నల్ల సముద్ర ప్రాంతాలలో సముద్ర వాణిజ్యం, భారత నావికుల భద్రతపై ప్రభావం చూపిన సంఘర్షణలతో సహా కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా వారు చర్చించారు. ఈసారి భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో బ్రిక్స్‌లో భారత్--రష్యా భాగస్వా మ్యం గురించి కూడా ఇద్దరు నాయకులు చర్చించారు.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య కూడా దృఢంగా నిలబడిన తమ ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వారు అంగీకరించారు. 24వ భారత్--రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీని రష్యాకు ఆహ్వానించారు. మోదీ ఆ ఆహ్వానాన్ని అంగీకరించారు. అయితే తేదీలను దౌత్య మార్గాల ద్వారా ఖరారు చేయనున్నారు.
సమావేశం అనంతరం, ప్రధాని మోదీ, పుతిన్ మరోసారి ఇన్నోప్రోమ్ ఎగ్జిబిషన్‌కు ఒకే కారులో కలిసి ప్రయాణించారు. ఈ ఇద్దరు నాయకులు కలిసి కారులో ప్రయాణించడం ఇది నాలుగోసారి. గత 11 ఏళ్లలో వారు 19 సార్లు పుతిన్, మోదీ సమావేశమయ్యారు. పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్లో భారతదేశాన్ని సందర్శించారు. ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఈ తాజా చర్చలు ప్రధాన్యత సంతరించుకున్నాయి.
పుతిన్‌కు ‘తిరుక్కురల్’ బహుమతి..
ఈ సమావేశం ప్రారంభంలో, తమిళ కవి, తత్వవేత్త అయిన తిరువళ్లువర్ అందించిన శతాబ్దాల నాటి జ్ఞానాన్ని కలిగి ఉన్న ప్రాచీన తమిళ క్లాసిక్ ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాదాన్ని ప్రధాని మోదీ పుతిన్‌కు బహుమతిగా ఇచ్చారు. రష్యాతో ఈ గ్రంథానికి ఉన్న అనుబంధం ఎవ్వరికీ అంతగా తెలియకపోవచ్చు. కానీ ఈ శతాబ్దాల సంబంధం కారణంగా మోదీ బహుమతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. పుస్తకాన్ని ఇస్తూ ప్రధాని మోదీ దానిలోని శాశ్వతమైన జ్ఞానాన్ని కొనియాడి, అది రష్యావ్యాప్తంగా ఉన్న పాఠకులకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ పుస్తకం మన ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను’ అని అన్నారు.