24 April, 2026 | 1:52 AM

నకిలీ విత్తనాల రవాణాపై కఠిన చర్యలు

24-04-2026 12:00 AM

క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలి: కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 23(విజయ క్రాంతి): జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాల రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. గురువారం  కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్  డేవిడ్,  సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, డీఎస్పీ మసీనొద్దీన్ తదితరులతో కలిసి తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వానాకాలం దృష్ట్యా విత్తన దుకాణాలు, గోదాములను అకస్మాత్తుగా తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల రవాణాపై నిఘా ఉంచాలని తెలిపారు. నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నకిలీ విత్తనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారి లైసెన్సులు రద్దు చేసే వరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఇసుక అక్రమ రవాణా నియంత్రణపై కూడా అధికారులు సమన్వయంతో పనిచేయాలని  సూచించారు. ఇసుక త్రవ్వకం, రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా సాగాలని చెప్పారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా  జిల్లాలో చేపడుతున్న జనగణన కార్యక్రమానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జనగణన2027 కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన చేపడతామని తెలిపారు. ఈ నెల 26 నుంచి మే 10 వరకు sc.census.gov.in వ్బుసైట్ ద్వారా స్వీయ గణన చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు స్వీయ గణన ఐడీ అందించవచ్చని చెప్పారు. అధికారులు గణన కోసం వచ్చినప్పుడు ప్రజలు సరైన, వాస్తవ సమాచారాన్ని అందించాలని  సూచించారు.